హైదరాబాద్, సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి మోసగించిన ఓ ఘరానా మోసగాడిని అరెస్టు చేసినట్టు ఈవోడబ్ల్యూ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన గురువారం విలేకరులకు వెల్లడించారు. నగరానికి చెందిన రమావత్ మధు శుభక్షేత్ర సంస్థ పేరుతో పెద్ద మొత్తంలో పెట్టుబడులను సేకరించాడని పేర్కొన్నారు.
తమ సంస్థలో రూ.5లక్షలు పెట్టుబడి పెడితే.. 102 గజాల స్థలంతోపాటు, ప్రతినెలా రూ.25 వేలు చొప్పున 40 నెలలపాటు చెల్లిస్తానని నమ్మబలకడంతో, దీనికి ఆకర్శితులైన పలువురు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినట్టు వివరించారు. కానీ మధు ఇచ్చిన హామీ మేరకు స్థలాలు, నెలవారి రాబడి ఇవ్వకపోవడంతో మోసపోయినట్టు గ్రహించిన పటాన్చెరుకు చెందిన 33మంది బాధితులు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.