CITU | తొగుట, ఫిబ్రవరి 12: తొగుట మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ సిద్ధిపేట జిల్లా కోశాధికారి జి భాస్కర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం-2025, విబి జి-రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసీలో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించడం లాంటి ప్రమాదకర నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక సంఘాలు, కార్మిక చట్టాలు లేని దేశంగా మార్చాలని, కార్మికుల్ని కట్టు బానిసలుగా చేసి పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్లకు మేలు చేస్తుందని విమర్శించారు. అందులో భాగంగానే వీరోచితంగా పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తెచ్చిందని విమర్శించారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి విబి జి-రామ్ జీ స్కీమ్‌ను తెచ్చి రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపిందని, విద్యుత్ సవరణ బిల్లు-2025, విత్తన సవరణ చట్టం, ఇన్సూరెన్స్ రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి లాంటి మరిన్ని వినాశకరమైన చట్టాలను, బిల్లులను తీసుకొచ్చి శ్రమజీవులపై దాడి చేస్తుందని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తారంగా ఉన్న శ్రామిక వర్గాలను మోసం చేస్తుందన్నారు.
ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసే రాజ్యాంగ వ్యతిరేక చర్య..
కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ల అమలుతో 40 కోట్ల సంఘటిత, అసంఘటిత కార్మికులు వారి కుటుంబాలు చితికిపొయ్యేలా, కార్పొరేట్లు లాభాలు పోగేసుకోడానికి మార్గం సుగమం చేసిందనీ, కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలోని కార్మిక చట్టాలను నియంతృత్వంగా, దౌర్జన్యపూరితంగా కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకొని మార్చి వేసిందని మండిపడ్డారు. ఇది రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసే రాజ్యాంగ వ్యతిరేక చర్య అని విమర్శించారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ “ఐఎల్‌డీ” సిఫారసులను కూడా విస్మరించిందన్నారు.
కార్మికుల హక్కులపై ఉక్కుపాదం..
బ్రిటీష్ ప్రభుత్వంతో పోరాడి సాధించుకున్న ట్రేడ్ యూనియన్ చట్టం- 1926 ప్రకారం యూనియన్ల ఏర్పాటు కార్మికుల హక్కుగా పొందారు. కానీ ఈ లేబర్ కోడ్లతో కార్మికులు సంఘం పెట్టే హక్కు, సంఘటితమయ్యే హక్కు, నిరసనలు, సమ్మె చేసే హక్కులపై ఉక్కుపాదం మోపారనీ, ఉద్యోగ భద్రత పట్ల యాజమాన్యాలకున్న అన్ని బాధ్యతలను తొలగించారని… హైర్ & ఫైర్ పద్ధతిని తీసుకొచ్చి పర్మినెంట్ ఉద్యోగాలకు మంగళం పాడారన్నారు. కోర్ యాక్టివిటీలో సైతం విచ్చలవిడిగా కాంట్రాక్ట్ కార్మికులను నియమించుకోవడం చట్టపరం చేయడం దుర్మార్గం అన్నారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి .ప్రవీణ,మండల కన్వీనర్ వసంత, శ్యామల, స్వప్న,వారమ్మ, దేవమ్మ, వరవ్వ,భాగ్య, లక్ష్మి, హేమలత,సాబేర, లావణ్య,మాణిక్యం,నర్సింలు, మల్లేశం, శ్రీనివాస్, మౌనిక, తదితరులు పాల్గొన్నారు.