తాండూర్ : తాండూరు సీఐగా పనిచేసి కాగజ్‌నగర్‌కు బదిలీపై వెళ్లున్న సీఐ కుమారస్వామి ( CI Kumaraswamy) సేవలు అభినందనీయమని తాండూరు మండల అధికారులు, నాయకులు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో వీడ్కోలు సమావేశం సందర్భంగా సీఐ కుమారస్వామికి వీడ్కోలు, నూతనంగా తాండూర్ సీఐగా బదిలీపై వచ్చిన దేవయ్య ( Devaiah ) కు సన్మానం నిర్వహించారు.
అనంతరం నాయకులు, అధికారులు మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ శాంతి భద్రతలను ( Peace and Security ) పరిరక్షిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన శైలితో విధులు నిర్వహించిన కుమారస్వామి సేవలు చిరస్మరణీయమన్నారు. యువతను చైతన్య పరిచేలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడమే కాక నిత్యం గిరిజనులకు అండ దండలు అందించి వారి సమస్యలు పరిష్కరించడంలో కుమారస్వామి ముందున్నారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని పలువురు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఈవో మల్లేశం, మాదారం ఎస్సై సౌజన్య, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సూరం రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ సిరంగి శంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సల్వాజి మహేందర్ రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గట్టు మురళీధర్ రావు, మాజీ జడ్పీటీసీ సాలిగామ బానయ్య, సీనియర్ నాయకులు దత్తు దొర, ఎలక రామచందర్, పెరిక రాజన్న, పులగం తిరుపతి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.