న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: సెమీకండక్టర్ చిప్స్, డిస్ప్లే తయరీ ప్లాంట్ల ఏర్పాటు కోసం 5 కంపెనీల నుంచి రూ.1.53 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు అందినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వేదాంత-ఫాక్స్కాన్ జాయింట్ వెంచర్, ఐజీఎస్ఎస్ వెంచర్స్, ఐఎస్ఎంసీలు 13.6 బిలియన్ డాలర్ల పెట్టుబడితో చిప్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించాయని, సెమీకండక్టర్ తయారీ కార్యక్రమానికి ప్రభుత్వం కేటాయించిన రూ.76,000 కోట్ల ఫండ్ నుంచి రూ.42,000 కోట్ల మద్దతును కోరాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
మరోవైపు వేదాంత, ఎలెస్ట్లు 6.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో డిస్ప్లే తయారీ యూనిట్ల ఏర్పాటుకు సమర్పించిన ప్రతిపాదనల్లో డిస్ప్లే ఫ్యాబ్స్ స్కీమ్ కింద కేంద్రం నుంచి రూ.2.7 బిలియన్ డాలర్ల ఆర్థిక మద్దతును అందించాలని కోరాయి. ఎస్పీఈఎల్, హెచ్సీఎల్, సైర్మా టెక్నాలజీ, వాలెంకని ఎలక్ట్రానిక్స్ కంపెనీలు సెమీకండక్టర్ ప్యాకేజింగ్, రుట్టోన్షా ఇంటర్నేషనల్ రెక్టీఫైయర్.. కాంపౌండ్ సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం వద్ద రిజిష్టర్ చేసుకున్నాయి. టెర్మినస్ సర్క్యూట్స్, ట్రిస్పేస్ టెక్నాలజీస్, క్యూరీ మైక్రోఎలక్ట్రానిక్స్లు డిజైన్డ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద దరఖాస్తులు సమర్పించాయని ప్రకటన తెలిపింది.