మనకు పరమేశ్వరుడే జన్మ, ఆయువు, భోగాలను ఇస్తున్నాడని మరువరాదు. అయితే, పరమేశ్వరుడు మన ప్రమేయం లేకుండా, తన ఇష్ట ప్రకారమే ఆ మూడింటిని ఇస్తాడనేది అసంగతం. మనం చేసే కర్మలను బట్టి జన్మ సంప్రాప్తమవుతుంది. జన్మను బట్టి సుఖ దుఃఖాలు అనుభవించవలసి వస్తుంది. గమ్మత్తయిన విషయమేమంటే, ఏ జీవి అయినా సుఖ దుఃఖాలను ఎంతకాలం అనుభవించాలో అంతకాలం శరీరంలో ఉండవలసిందే! ఈ కాలమే ఆయువు. జన్మను, సుఖదుఃఖాలను కొని తెచ్చుకొన్నట్లే ఆయువును కూడా సంపాదించుకునేవాడు జీవుడే.
కర్మలకు కర్తలమైనట్లే కర్మఫలాలకు మనమే భోక్తలం. అయితే మనం చేసిన కర్మలకు ఫలాఫలాలను నిర్ణయించుకునే అవకాశం మనకు లేదు. అలాగే కర్మఫలాలను ఎంతకాలం అనుభవించాలో మనకు తెలియకుండా జరుగుతుంది. మనం ఈ శరీరంలో ఉన్నప్పుడే మరో జన్మ తాలూకు శరీరాన్ని రూపొందించుకుంటామని పండితులు చెప్తుంటారు. అయితే జన్మ(శరీరం)కు కారణం మనమే అయినా, జన్మనిచ్చేవాడు పరమేశ్వరుడు. సుఖదుఃఖాలను అనుభవించేవారం మనమే అయినా, వాటిని ఇచ్చేవాడు పరమేశ్వరుడు. జన్మించి ఆయా శరీరాల్లో ఉండవలసింది మనమే అయినా, ఎంతకాలం ఉండాలో నిర్ణయించేవాడు పరమేశ్వరుడు. ఇదే సృష్టి వైచిత్రి. కర్మలకు మనం అధికారులమైనా కర్మఫలాలను నిర్ణయించుకునే అధికారం మనకు లేదు. అలాగే ఏ సుఖాన్ని ఎప్పుడు అనుభవించాలో, ఏ దుఃఖాన్ని ఎప్పుడు అనుభవించాలో, ఎంతకాలం అనుభవించాలో మన చేతిలో లేదు.
ఆయువు తీరగానే మనం శరీరాన్ని వదిలిపెడతాం. కానీ, ఆ ఆయువు ఎంతకాలం ఉంటుందో తెలియదు. వేదం ప్రకారం మనిషి ఆయువు నూరు, అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు. ‘జీవేమ శరదశ్శతమ్’ నూరేండ్ల్లు బతకాలని వేదం చెప్తుంది. ‘భూయశ్చ శరదశ్శతాత్’- నూరేండ్ల కన్నా ఎక్కువగా జీవించమని కూడా వేదమే చెప్తున్నది. ఒకరకంగా మానవుని ఆయువు వందేండ్లని నిర్ణయమైంది. కానీ, అందరూ వందేండ్లు జీవిస్తున్నారా? అంటే లేదని సమాధానం వస్తుంది. దీనికి కారణం ఏమిటి? కర్మఫలానుభవం లేకుండానైనా ఉండాలి. లేదా మనం అకాల మరణానికి గురై ఉండాలి. పూర్ణాయుష్కులం కావలసిన బాధ్యత మనమీదే ఉంది. కానీ, త్వరగా మృత్యు ముఖంలోకి జారిపోతున్నాం. అందుకే వేదం ‘ఓ విద్వాంసుడా! అకాల మరణాన్ని పొందకు’ అని చెప్తుంది.
లోకంలో మృత్యుభయం లేనివారు సాధారణంగా ఉండరు. మృత్యువు కన్నా, మృత్యుభయం మనల్ని ఎక్కువగా బాధిస్తుంది. యోగులైన వారు సమాధి ద్వారా ఎప్పుడంటే అప్పుడు ఈ శరీరాలను త్యజిస్తారు. భోగులకు అది సాధ్యం కాదు. శరీరాలే వారిని విడిచిపెట్టి పోతాయి. యోగులు కాని, భోగులు కాని కర్మలు చేస్తూ నూరేండ్లు జీవించే అవకాశం ఉన్నది.
‘కుర్వన్నేవ కర్మాణి జిజీవిషేత్ శతస్సమాః’ (యజుర్వేదం 40.2)
నూరేండ్లు జీవించే అవకాశం ఉన్నప్పుడు మధ్యలో దేహత్యాగం చేయవలసిన పనిలేదు. మనం మన ఆరోగ్యాన్ని రక్షించుకుంటే చాలు. పూర్ణాయుష్కులం కావచ్చు. జీవితకాలంలో మనం ధనాన్ని ఎట్లా రక్షించుకుంటామో, అట్లాగే ఆయువును కూడా రక్షించుకోవలసి ఉన్నది. అందుకే వేదం ‘బాధస్వ ద్విషో రక్షసో అమీనాః’ (యజుర్వేదం 11-49) అంటుంది. ‘ఓ వైద్యుడా! ద్వేషించేవారిని, హింసించేవారిని, రోగాలను దూరం చేయండి’ అని భావం. మృత్యువుకు దయ ఉండదు. అది మనల్ని భయపెడుతుంది. తొందరగా ఆవేశిస్తుందని భయపడతాం కూడా! కానీ, పరమేశ్వరుణ్ని ఆశ్రయిస్తే మృత్యువు మనల్ని ఏమీ చేయదు.
నీతి, నిజాయతీతోపాటు నిర్భయత్వం మనిషి ఆయుర్దాయాన్ని పెంచుతాయి. అందుకే వేదం ‘నిన్ను ఆశ్రయించిన జీవుల సంరక్షణలో ఏమరుపాటు చూపకూడదు’ అని ప్రబోధిస్తుంది. లోకయాత్ర ముగించిన పుణ్య పురుషుల మార్గంలో నడుస్తూ ఉండాలి గాని, మృత్యుముఖంలోకి జారిపోవద్దని ఉపదేశిస్తుంది. ‘ఓ మానవా! నువ్వు మరణించవు, భయపడవద్దు’ అని వేదం ధైర్యాన్నిస్తుంది. అంతేకాదు, ‘నువ్వు అల్పాయుష్కుడవు కావద్దు’ అని హెచ్చరిస్తుంది. ధార్మిక జీవనం గడుపుతూ పూర్ణాయుష్కులమై ఈ జన్మలోనే ముక్తిని పొందాలని సూచిస్తుంది.
ఆచార్య మసన చెన్నప్ప
98856 54381