Vivo-ED | మనీ లాండరింగ్ కేసులో తమ స్మార్ట్ ఫోన్ సంస్థ ‘వివో’ ఎగ్జిక్యూటివ్‌ల అరెస్ట్‌పై చైనా స్పందించింది. తమ స్మార్ట్ ఫోన్ సంస్థ ఉద్యోగులకు కాన్సులర్ ప్రొటెక్షన్ కల్పిస్తామని, అవసరమైన సాయం అందిస్తామని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ సోమవారం మీడియా సమావేశంలో చెప్పారు. ‘భారత్‌తోపాటు వివిధ దేశాల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న చైనా వ్యాపార సంస్థల చట్టపరమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు మా ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుంది. రెండు దేశాల మధ్య పరస్పర వ్యాపారంలో సహకరించుకోవాలన్న సూత్రాన్ని భారత్ గుర్తిస్తుందని మేం ఆశాభావంతో ఉన్నాం. ఈ కేసు విచారణలో పారదర్శకంగా, స్వేచ్ఛగా వ్యవహరిస్తుందని, వివక్షాపూరితమైన వాతావరణం నెలకొల్పదని భావిస్తున్నాం’ అని తెలిపారు.
మనీ లాండరింగ్ కేసులో చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివోతోపాటు ఇతర స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థల ప్రతినిధులను గత వారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలను తాము జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు మావో నింగ్ తెలిపారు. పీఎంఎల్ఏ చట్టం కింద
వివో ఇండియా తాత్కాలిక సీఈఓ హాంగ్ జువాన్ అలియాస్ టెర్రీ, సీఎఫ్ఓ హరిందర్ దాహియా, కన్సల్టెంట్ హేమంత్ ముంజాల్లను ఈడీ అధికారులు గత వారం అరెస్ట్ చేసింది. ఇంతకుముందు లావా ఇంటర్నేషనల్ ఎండీ హరి ఓం రాయ్, చైనీయుడు గుంగ్వెన్ అలియాస్ ఆండ్రూ కువాంగ్, చార్టర్డ్ అకౌంటెంట్లు నితిన్ గార్గ్, రాజన్ మాలిక్ లను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వీరు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు.