హైదరాబాద్, ఏప్రిల్ 11 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): రాజు మరణిస్తే, రాజ్యాధికారాన్ని చేపట్టేందుకు కొడుకుల మధ్య అంతర్యుద్ధం జరుగడాన్ని చరిత్రలోనూ, సినిమాల్లోనూ చూశాం. అయితే, మనుషులకే పరిమితమైందనుకొన్న ఈ రాజ్య కాంక్ష చింపాంజీల్లోనూ ఉన్నట్టు తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ఉగాండాలోని కిబాలే నేషనల్ పార్కులో 2015లో ఓ వృద్ధ చింపాంజీ మరణించింది.
అప్పటివరకూ కలిసిమెలసి బతికిన మిగతా చింపాంజీలు వృద్ధ చింపాంజీ మరణం తర్వాత రెండు వర్గాలుగా విడిపోయి ప్రతీరోజూ పరస్పర దాడులకు తెగబడుతున్నాయి. ఏడేండ్లుగా కొనసాగుతున్న ఈ అంతర్యుద్ధంలో ఇప్పటివరకూ 7 చింపాంజీలతో పాటు మరో 17 పిల్ల చింపాంజీలు మరణించినట్టు అధ్యయనకారులు పేర్కొన్నారు. రెండు వర్గాల్లో ఒక వర్గం బలంగా మారడంతో అందులోని ఓ చింపాంజీ ఆ సమూహానికి ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ వివరాలు ‘సైన్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.