తాను అడిగిన 8 ప్రశ్నలకు ఇన్స్పెక్టర్ రుద్ర కరెక్ట్‌గా సమాధానాలు చెప్పడంతో ‘మిషన్ డోలో’లోని 8 దశల్లో మిగతా ఆరు దశల గురించి చెప్పడం ప్రారంభించాడు డోలో. రుద్ర సహా జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ కరణ్, ఫోరెన్సిక్ ఇన్చార్జి జయ, స్నేహిల్, హెడ్ కానిస్టేబుల్ రామస్వామి శ్రద్ధగా వింటున్నారు.
‘రుద్ర.. నేను ఇదివరకే చెప్పినట్టు మిషన్ డోలో 8 దశల్లో ఉంటుంది. నా జర్నీకి రివర్స్‌లో ఇది జరుగుతుంది. అంటే తొలి దశ చైనా నుంచి మొదలై.. చివరి దశ పాకిస్థాన్‌తో ముగుస్తుంది. తొలి దశ పేరు సూసైడ్ వెపన్. చివరి దశ పేరు మాస్ స్టెరిలైజేషన్. మధ్యలో ఉన్న ఆరు దశలు.. హ్యూమన్ షీల్డ్, బయోకెమీ క్రియేచర్, హంగర్ వెపన్, ఇన్విజిబుల్ టార్గెట్, మాస్ కిల్లింగ్, లింక్డ్ డేంజర్ గేమ్’ అని ఆపాడు. ‘అంటే నువ్వు చెప్పే ఈ దశలు.. నీ జర్నీకి రివర్స్‌లో ఉన్నాయా?’ అని రుద్ర అనగానే.. ‘యెస్.. చైనాలో సూసైడ్ వెపన్, శ్రీలంకలో హ్యూమన్ షీల్డ్, ఇటలీలో బయోకెమీ క్రియేచర్, బల్గేరియాలో హంగర్ వెపన్, బెలారస్లో ఇన్విజిబుల్ టార్గెట్, ఫిన్లాండ్లో మాస్ కిల్లింగ్, ఫ్రాన్స్‌లో లింక్డ్ డేంజర్ గేమ్.. చివరకు పాకిస్థాన్‌లో మాస్ స్టెరిలైజేషన్ దశలు యాక్టివేట్ అవుతాయి’ అని డోలో ఆగిపోయాడు.
ఇంతలో కలుగజేసుకొన్న స్నేహిల్.. ఈ ఒక్కో దశలో ఏం జరుగబోతుంది?’ అని అడిగాడు. అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందు తాను అడిగే నాలుగు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డోలో కండిషన్ పెట్టాడు. ‘ఏమిటా?’ అన్నట్టు ప్రశ్నార్ధకంగా చూశాడు రుద్ర. డోలో కొనసాగిస్తూ.. ‘రుద్ర.. మరేం భయపడకు. హార్డ్ క్వశ్చన్స్ అడిగీ, అడిగీ నాకు కూడా బోర్ కొట్టింది. అందుకే, ఈసారి చాలా సింపుల్ క్వశ్చన్లు నాలుగు అడుగబోతున్నా. వాటికి ఈసారి నువ్వు ఆన్సర్లు చెప్పకూడదు. నీ బుర్ర తక్కువ గ్యాంగ్ సమాధానాలు చెప్పాలి. ఒక్కొక్కరికి ఐదు సెకండ్ల టైమ్ ఇస్తా. ఈ డీల్‌కు నువ్వు ఓకే అంటే.. ప్రారంభిస్తా’ అన్నాడు డోలో. మధ్యలో కలుగజేసుకొన్న రామస్వామి.. ‘సార్.. వీడిని ఇట్లే వదిలేస్తే ఈ కేసును ఇలాగే సాగదీస్తాడు. మన ైస్టెల్లో నాలుగు తగిలిస్తే.. ’ అంటూ ఆ వెంటనే ఆగిపోయిన రామస్వామి ఎదురుగా ఉన్న రుద్ర ముఖ కవళికలను గమనించాడు. అంతే, రుద్ర మాట్లాడకపోయినప్పటికీ.. అతని చూపులే ఏదో చెప్తున్నట్టు రామస్వామికి అనిపించింది.
ఇంతలో.. ‘డోలోకు హిప్నొటైజేషన్ తెలుసు. నొప్పి సమాచారాన్ని మెదడుకు చేరవేసే నాడులను అతను ఈజీగా నియంత్రణలోకి తెచ్చుకోగలడు. అంటే ఎంత కొట్టినా వాడికి ఏమీ నొప్పి తెలియదు’ అన్న విషయం గుర్తొచ్చి రామస్వామి మరేమీ మాట్లాడలేదు. ఆ వెంటనే కలుగజేసుకొన్న కరణ్.. ‘రుద్ర.. మరేంపర్లేదు. మేం నలుగురం ఆన్సర్లు చెప్తాం. మనకు కావాల్సింది ఈ మిషన్ డోలోను ఆపడం. అది జరుగాలంటే ఆ 8 దశల గురించి వివరంగా తెలుసుకోవాలి’ అంటుండగానే.. ‘డోలో ప్రశ్నలకు సమాధానాలు చెప్తాం’ అంటూ అందుకొన్నారు జయ, స్నేహిల్, రామస్వామి. ప్రారంభించాడు డోలో.
‘ఒరేయ్ ముసలోడా.. ఈ మొదటి ప్రశ్న నీకు. ఒకడు 30వ ఫ్లోర్‌లోని పోర్షన్లో ఉంటాడు. రోజూ ఆఫీసుకు వెళ్లేప్పుడు లిఫ్ట్ యూజ్ చేస్తాడు. అయితే, ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం.. గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఎక్కి పదో ఫ్లోర్ వరకే వస్తాడు. ఆ తర్వాత మెట్ల మార్గంలో తన పోర్షన్‌కి వస్తాడు. అయితే, ఇంటికి వచ్చేప్పుడు లిఫ్ట్‌లో తనతో ఎవరైనా ఉంటేమాత్రం 30వ ఫ్లోర్ వరకూ వస్తాడు. ఎందుకు?’ యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. అని రుద్ర కౌంటింగ్ స్టార్ట్ చేయకముందే.. ‘నీ ముఖంలాగే ఉంది ఈ క్వశ్చన్’ అంటూ ఠక్కున ఆన్సర్ చెప్పాడు రామస్వామి. అందరూ ఒక్కసారిగా ఆనందపడుతూనే షాకయ్యారు.
రామస్వామి నుంచి కరెక్ట్ ఆన్సర్‌ను ఊహించని డోలో.. జయకు రెండో ప్రశ్నను విసురుగా సంధించాడు. ‘30వ ఫ్లోర్‌లోని పోర్షన్లోకి వచ్చిన ఆ వ్యక్తే.. తన అపార్ట్మెంట్లోని విండో నుంచి కిందకు దూకాడు. అయితే, ఏమీ కాలేదు. అన్నట్టు కింద జాలి లాంటి వల గానీ, స్పాంజ్ టైప్ పరుపులు గానీ ఏమీలేవు. ఎలా?’ అని డోలో క్వశ్చన్ పూర్తి చేయకముందే, జయ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. రుద్ర టీమ్ తెలివితేటలకు డోలోకు తల తిరిగినంతపనైంది. ఆ మైకంలోనే స్నేహిల్‌కు మూడో ప్రశ్నను వేశాడు డోలో. ‘30వ ఫ్లోర్లో ఉన్న ఈ వ్యక్తే ఆఫీసుకు డైలీ లేట్‌గా వెళ్తున్నాడు. డైలీ టాస్క్‌లన్నీ పెండింగ్గానే పెడుతున్నాడు. అయినా, వీడి బాస్ ఏమనట్లేదు. ఎందుకు?’ అని డోలో ప్రశ్న అడగ్గానే.. ఆ వెంటనే స్పందించిన స్నేహిల్ ‘ఒరేయ్ డోలో.. నీ ప్రశ్నలేంటిరా.. ఇంత దారుణంగా ఉన్నా’యంటూ సమాధానమిచ్చాడు.
డోలోకు ఫ్యూజులు ఎగిరిపోయినంత పనైంది. వెంటనే తేరుకొన్న డోలో.. ‘నేను అడిగే ఈ ఆఖరి క్వశ్చన్ నా మిషన్‌కు లింక్ అయ్యి ఉంటుంది.. కరణ్ నువ్వు కూడా పోలీసోడివేగా.. నీకే ఈ క్వశ్చన్. జాగ్రత్తగా విను’ అని డోలో అనగానే.. సిద్ధంగానే ఉన్నట్టు సైగ చేశాడు కరణ్. ‘ఒక లేడీ రాత్రి పడుకొనే ముందు లైట్ ఆఫ్ చేసింది. అంతే తెల్లారేసరికి వందలాది మంది కాళ్లు విరిగి, రక్తం కక్కుకొని, అవయవాలు ఛిద్రమై చనిపోయారు. ఎందుకు?’ అని ప్రశ్నను అడగ్గానే.. సన్నగా నవ్విన కరణ్ వెంటనే ఆన్సర్ చెప్పాడు. ‘ఏందిరా బాబూ.. అందరూ ఇంత షార్ప్‌గా తయారయ్యారు. రుద్ర గాడితో తిరిగి మీకు కూడా ఆ స్మార్ట్మైండ్ అబ్బిందా ఏంటీ??’ అంటూ ఆశ్చర్యపోయిన డోలో.. అందరూ కరెక్ట్‌గా సమాధానాలు చెప్పడంతో ఒక్కో దశలో ఏం జరుగబోతుందో లోతుగా వివరించి చెప్పడం ప్రారంభించాడు. అది పక్కనబెడితే.. డోలో అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పగలరా?
సమాధానాలు : 1. ఆ వ్యక్తి ఎత్తు తక్కువగా ఉంటుంది. అందుకే లిఫ్ట్‌లో 10వ ఫ్లోర్ బటన్ వరకే అతని చెయ్యి అందుతుంది. 2. విండో నుంచి గది లోపలికి దూకాడు. 3. ఆ వ్యక్తే ఆ ఆఫీసుకు బాస్. 4. ప్రశ్నలో పేర్కొన్న లేడీ. లైట్‌హౌజ్ ఆపరేటర్. లైట్ ఆఫ్ చేయడంతో ఒకదానికొకటి నౌకలు ఢీకొన్నాయి.