ఆఫీస్‌లో మీటింగ్స్ అంటేనే సగం మందికి నిద్రొస్తుంది. ఎవరేం మాట్లాడుతున్నారో, చివరికి తేలిందేంటో అర్థం కాక బుర్ర గీక్కునే పరిస్థితి. కానీ, ఇప్పుడా రోజులు పోయాయి. వర్చువల్ మీటింగ్స్ (Zoom, Teams, Meet) ఇప్పుడు వీడియో కాల్స్ మాత్రమే కాదు.. అవి ఏఐ పవర్డ్ ‘స్మార్ట్ రూమ్స్’గా మారిపోతున్నాయి. మీరు మీటింగ్‌లో లేకపోయినా, ఏం జరిగిందో క్లుప్తంగా చెప్పేసే ‘ఏఐ అసిస్టెంట్స్’ అందుబాటులోకి వచ్చేశాయి. ఆఫీస్ ప్రొడక్టివిటీని పెంచుతున్న ఈ ఏఐ మ్యాజిక్ ఏంటో చూద్దాం.
మీటింగ్ జరుగుతున్నప్పుడు పాయింట్స్ నోట్ చేసుకోవడం పెద్ద టాస్క్. దీంతో చర్చ మీద ఏకాగ్రత తగ్గుతుంది. ఇప్పుడు ఏఐ టూల్స్ మీ తరఫున నోట్స్ రాస్తాయి. మీటింగ్ ముగియగానే.. ఎవరు ఏ పాయింట్ చెప్పారు? ఎవరికి ఏ బాధ్యత అప్పగించారు? అనే వివరాలను ఓ చక్కని రిపోర్ట్‌లా మెయిల్ చేస్తుంది. ఇది కేవలం సమయాన్ని ఆదా చేయడమే కాదు, తప్పులు జరగకుండా చూస్తుంది. బోరింగ్ మీటింగ్స్‌ని గేరు మార్చి జోరు పెంచుతున్న ఏఐ టూల్స్ కొన్ని..

ఒట్టర్ (Otter.ai): ఎక్స్లెంట్ లైవ్ ట్రాన్స్క్రిప్షన్! లైవ్‌లో మాటలు టెక్ట్స్‌గా మారాలి అంటే ‘ఒట్టర్’కి మించినది లేదు. ఒట్టర్ పైలట్: ఇది ఆటోమేటిక్‌గా జూమ్ లేదా గూగుల్ మీట్లో జాయిన్ అయ్యి, టీమ్ మెంబర్స్ అందరూ కలిసి ట్రాన్స్క్రిప్ట్లో ముఖ్యాంశాలను హైలైట్ చేసేలా చేస్తుంది.
స్లాక్ ఇంటిగ్రేషన్: మీటింగ్‌లో నిర్ణయించిన పనులను (Action Items) వెంటనే ‘స్లాక్’ (Slack) యాప్ ద్వారా టీమ్ అందరికీ పంపి పనులను వేగవంతం చేస్తుంది.

ఫైర్‌ఫ్లైస్ (Fireflies.ai): సెర్చబుల్ మీటింగ్ లైబ్రరీ! మీటింగ్ లో జరిగిన చర్చను ఒక లైబ్రరీలా దాచి ఉంచడంలో ఇది దిట్ట.
భాషా ప్రావీణ్యం: 60 కంటే ఎక్కువ భాషల్లో మీటింగ్స్‌ని ట్రాన్స్క్రైబ్ చేస్తుంది. చర్చలోని అంశాలను బట్టి ‘స్మార్ట్ చాప్టర్స్’గా విడదీస్తుంది.
CRM ఇంటిగ్రేషన్: సేల్స్‌ఫోర్స్ లాంటి సాఫ్ట్వేర్లతో ఇది అనుసంధానమై ఉంటుంది. ‘హే ఫైర్‌ఫ్లైస్’ అని వాయిస్ కమాండ్ ఇస్తే చాలు. ఫాలో-అప్ పనులను కూడా చక్కబెడుతుంది.

జేమీ ఏఐ (Jamie AI): ప్రైవసీకి పెద్దపీట! చాలా ఏఐ టూల్స్ మీటింగ్‌లోకి ఒక ‘బాట్’ (Bot) లాగా జాయిన్ అవుతాయి. కానీ జేమీ ఏఐ అలా కాదు. ఇది బాట్-ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
ప్రత్యేకత: ఆన్లైన్ మీటింగ్స్ మాత్రమే కాదు, ఇన్-పర్సన్ (నేరుగా కలిసే) మీటింగ్స్‌లో కూడా నోట్స్ రాస్తుంది
ప్రైవసీ: సెన్సిటివ్ విషయాలు చర్చించేటప్పుడు ప్రైవసీ ముఖ్యం అనుకునే వారికి ఇది బెస్ట్. ఇది రియల్ టైమ్ ట్రాన్స్‌క్రిప్షన్‌తో పాటు మీటింగ్ ముగియగానే ముఖ్యమైన పాయింట్స్ ఇస్తుంది.

ఏఐ మన మాటలన్నీ రికార్డ్ చేస్తున్నదీ… అంటే సెక్యూరిటీ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
డేటా లీకేజీ: మీటింగ్‌లోని రహస్య సమాచారం ఏఐ సర్వర్లలో ఎలా సేవ్ అవుతుందో కంపెనీ పాలసీలను సరిచూసుకోవాలి.
డిపెండెన్సీ: ఏఐ నోట్స్ ఇస్తుంది కదా అని మీటింగ్‌లో పరధ్యానంగా ఉంటే చర్చలోని లోతు (Context) మిస్ అయ్యే ప్రమాదం ఉంది.