ఆ భార్యాభర్తలిద్దరూ మెడిసిన్ చదివారు. అనుకున్నట్లుగా ఓ దవాఖాన పెట్టారు. కానీ, అదే వాళ్ల జీవితం అనుకోలేదు. చిన్నారులకు పుస్తక పఠనాన్ని పరిచయం చేసి వారిని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. అలా వాళ్ల ఆలోచనల్లోంచి పుట్టిందే ‘మన లైబ్రరీ’. సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించడమే కాకుండా పద్నాలుగేండ్లు కూడా నిండని పిల్లలతో అద్భుతమైన కథలను రాయిస్తున్నారు. అలా చిన్నారి రచయితలు రాసిన కథలను పుస్తక రూపంలోకి తెస్తున్నారు. ఒకవైపు పవిత్రమైన వైద్యవృత్తిలో ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతూ.. మరోవైపు బాలసాహిత్యానికి దన్నుగా నిలుస్తున్న డాక్టర్ అన్నవరపు విజయలక్ష్మి జిందగీతో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..
జహీరాబాద్‌తో నాది విడదీయరాని బంధం. నేను, నా భర్త డాక్టర్ శివబాబు వృత్తిరీత్యా వైద్యులం. ఇద్దరం కలిసి 2005 నుంచి జహీరాబాద్‌లో ప్రగతి హాస్పిటల్ ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నాం. మా అమ్మానాన్నలిద్దరూ సామాజిక ఉద్యమకారులు కావడంతో చిన్నతనం నుంచే నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. అమ్మ చాలారోజులు మహిళా సంఘంలో పనిచేయగా, నాన్న గ్రామానికి సర్పంచ్‌గా సేవలందించారు. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడే మా ఊరి గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకున్నాను. ప్రారంభంలో బాలజ్యోతి వంటి కథల పుస్తకాలను చదువుతూ నెమ్మదిగా నవలలు చదవడం ప్రారంభించాను. దానికితోడు నేను చదువుకునే రోజుల్లో విద్యార్థి సంఘంలో పనిచేయడం మూలంగా పుస్తక పఠనం మరింత దగ్గరైంది. అలా తెలియకుండానే పుస్తక పఠనం నా జీవితంలో భాగమైంది.
జహీరాబాద్‌లో దవాఖాన పెట్టి వైద్యవృత్తిలో స్థిరపడ్డాక కూడా పుస్తకాలు చదవడం ఏనాడూ విస్మరించలేదు. ఇంట్లో అందరికీ పుస్తకాలు చదివే అలవాటు ఉండటంతో చిన్నపాటి హోమ్ లైబ్రరీని ఏర్పాటు చేసుకున్నాం. ఖాళీ సమయం దొరికినప్పుడు చదువుదాం అనుకోలేదు. పుస్తక పఠనానికి ప్రతిరోజూ కొంత సమయం కేటాయించుకున్నాం. అలా పుస్తకాలంటే ప్రాణంగా భావించే నాకు.. 2008లో చిన్నారుల కోసం సమ్మర్ క్యాంప్ నిర్వహించాలనే ఆలోచన తట్టింది. వార్షిక పరీక్షల్లో మార్కుల కోసం విద్యా సంవత్సరమంతా పుస్తకాలతో కుస్తీ పడుతున్న ఆ చిన్నారి మెదళ్లకు కాస్త విశ్రాంతి ఇద్దామన్నది నా ఉద్దేశం. అందుకోసం మా దవాఖానలోని సెల్లార్‌ను గ్రంథాలయంగా మార్చాను. దానికి ‘మన లైబ్రరీ’ అని నామకరణం చేసి అందులో చిన్నారులకు ఉపయోగపడే పదివేలకు పైగా పుస్తకాలు సమకూర్చాను. జహీరాబాద్ పట్టణంలోని చిన్నారులతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే పిల్లలను ఆటోల్లో తీసుకొచ్చి ఎనిమిది రోజులపాటు సమ్మర్ క్యాంప్‌ను దిగ్విజయంగా నిర్వహించాను. వాళ్లకు ఇష్టమైన పాటలు పాడించడం, ఆటలు ఆడించడం, కథలు చెప్పించడం, బొమ్మలు గీయించడం లాంటి కార్యక్రమాలు నిర్వహించాను. అందుకు గాను ముందుగానే ఫ్యాకల్టీని కూడా సిద్ధం చేసుకున్నాను.

సమ్మర్ క్యాంపులో పాల్గొన్న చిన్నారులు పుస్తకాలు ఆసక్తిగా చదవడం గమనించాను. కొందరైతే క్యాంప్ ముగిసిన తర్వాత కూడా మా లైబ్రరీకి వచ్చేవారు. ఒక సందర్భంలో ‘పాఠశాల ప్రారంభమైతే పిల్లలు ఈ పుస్తకాలు చదవలేరేమో!’ అన్న ఆలోచన వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలు ఉంటాయని, అందులో పిల్లలు చదువుకునేందుకు చాలా రకాల కథల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని అనుకున్నాను. కొన్ని పాఠశాలలకు వెళ్లి పరిశీలిస్తే… అసలు లైబ్రరీలే లేవన్న సంగతి తెలిసింది. విద్యార్థులు చదవాలంటే పుస్తకాలు ఉండాలని ఆలోచించి అప్పటినుంచి జహీరాబాద్ ప్రాంతంలోని పాఠశాలలకు మన లైబ్రరీ కథల పుస్తకాలను మొబైల్ లైబ్రరీ పేరుతో వ్యాన్‌లో పంపిస్తున్నాను. ప్రతి పాఠశాలలో నాలుగైదు రోజులు ఆ పుస్తకాలను ఉంచి.. పిల్లలు చదివిన తరువాత, వాటిని మరో స్కూల్‌కు తరలిస్తున్నా.
‘మన లైబ్రరీ’ నిర్వహించే క్యాంప్‌లకు కథా రచయితలు కూడా హాజరయ్యేవారు. పిల్లలకు విలువైన సూచనలు చేసేవారు. కొందరు పిల్లల ఆసక్తిని గమనించిన రచయితలు… ‘ఆ చిన్నారులతో కథలు రాయిస్తే బాగుంటుంది కదా’ అని సూచన చేశారు. అలా పిల్లలతో కథలు రాయించడం మొదలుపెట్టాను. చిన్నారులు రాసిన కథలను సేకరించి, వాటిని ‘మన లైబ్రరీ’ తరఫున పుస్తక రూపంలో తీసుకొచ్చాం. 2010లో జహీరాబాద్ పిల్లల కథలు-1, 2016 జహీరాబాద్ పిల్లల కథలు-2, 2018 జహీరాబాద్ పిల్లల కథలు-3 పేరుతో మూడు పుస్తకాలు ముద్రించాం. ప్రతి సంకలనంలో 30కి పైగా కథలు ప్రచురించాం. పిల్లలు రాసిన సాహిత్యం అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో.. వాటిని ఉచితంగానే అందుబాటులో ఉంచాం. సుమారు 3,000 కాపీలు ప్రచురించి.. ఆత్మీయులు, చిన్నారులు, పుస్తక ప్రియులకు బహుమానంగా అందించాం. ఈ మూడు సంకలనాల్లోనూ అచ్చ తెలుగు కథలే ప్రచురించాం. త్వరలో తెలుగుతోపాటు ఇంగ్లిష్ కథలతో నాలుగో పుస్తకాన్ని తీసుకొస్తున్నాం.
కరోనా మహమ్మారి చిన్నారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపించింది. లాక్డౌన్లో ఇంటికే పరిమితమైన పిల్లలు.. ఫోన్‌కు బాగా అలవాటయ్యారు. తర్వాత మేం నిర్వహించిన సమ్మర్ క్యాంప్‌కి చాలామంది పిల్లలు ఫోన్‌తో వచ్చేవారు. ఫోన్ లేకుండా రావాలని కట్టడి చేయడంతో లైబ్రరీకి వచ్చే పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇలాగైతే లాభం లేదనుకొని.. మా సమ్మర్ క్యాంప్‌లు గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేయడానికి ఉద్యమించాం. మాకు తెలిసిన ఉపాధ్యాయుల సహకారంతో, 14 గ్రామాల్లో క్యాంప్‌లు నిర్వహించాం. ఒక్కో సెంటర్‌కు 50 మంది వరకు చిన్నారులు వస్తుండటం విశేషం. నిత్యం దవాఖానలో బిజీగా ఉన్నా.. పిల్లలు రాసిన కథలు చదివితే చాలు ఆ బరువంతా తగ్గిపోతుంది. ఈ ప్రాంతంలోని పిల్లలకు నావంతు ఆస్తిని అక్షర రూపంలో అందిస్తున్నాననే సంతృప్తి ఉంది. భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మరిన్ని కథలు వారితో రాయించి పుస్తకాల రూపంలోకి తేవాలన్నదే నా ఆకాంక్ష.

పరిచయమేర్పడింది. ఇద్దరిదీ ఒకే వృత్తి, ఇద్దరికీ పుస్తకాలంటే పిచ్చి. అలా నా ఆలోచనకు ఆయన ఆజ్యం పోశారు. ఆయనకు డీటీపీ చేయడమంటే కూడా ఇష్టమే. నేను ప్రచురించిన పుస్తకాలన్నింటికీ ఎంతో ఓపికతో ఆయనే డీటీపీ చేసిచ్చారు. నా కొడుకు హాస్టళ్లో ఉన్నప్పుడు వాడికోసం ఒక తల్లి ప్రేమను వ్యక్తపరుస్తూ 120 లేఖలు రాశా. ప్రతి కొడుకుకీ ఆ లేఖల్లోని సారాంశం వర్తిస్తుంది. వాటిని కూడా త్వరలో పుస్తక రూపంలో తీసుకొస్తున్నా.