e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home News ముందు జాగ్రత్తే మేలు

ముందు జాగ్రత్తే మేలు

గతవారం చెప్పుకొన్నట్టు, శరీరంలో తగినంత బ్రౌన్‌ ఫ్యాట్‌ లేకపోవడం, కాళ్లూ చేతులు పూర్తిగా ముడుచుకునే శక్తి నశించడం.. తదితర కారణాల వల్ల అసలే బరువు తక్కువగా ఉన్న నవజాత శిశువులు శరీర ఉష్ణోగ్రతను త్వరగా కోల్పోయి హైపోథెర్మియాకు గురవుతారు. పుట్టగానే శరీరానికి తగినంత ఆక్సిజన్‌ అందకపోయినా, రక్తంలో గ్లూకోజు తగ్గినా పసిపిల్లలు హైపోథెర్మియా స్థితికి చేరుకుంటారు.

ఇవీ లక్షణాలు..
బిడ్డ కాళ్లూ చేతులు చల్లబడతాయి. చికాకు, ఏడుపు ఎక్కువ అవుతాయి. అయినా నిర్లక్ష్యం చేస్తే, శరీర కదలికలు తగ్గుతాయి. రక్తనాళాలు సంకోచించడం వల్ల చర్మంపై చిన్నచిన్న మచ్చలు రావడం మొదలవుతుంది. గుండె వేగం, రక్తపోటు తగ్గుతాయి. శ్వాసక్రియ ఆగిపోవచ్చు. దీన్నే ‘అప్నియా’ అంటారు. రోగనిరోధక శక్తి తగ్గడంవల్ల అంటువ్యాధులు మొదలవుతాయి. చర్మం గట్టిపడటాన్ని ‘స్లెరిమా’ అంటారు. శరీరంలోని వివిధ నాళాలలో రక్తం గడ్డ కట్టడాన్ని ‘డిస్సెమినేటెడ్‌ ఇంట్రా వాస్క్యులర్‌ కొయాగ్యులేషన్‌’ అంటారు. ఈ దశలన్నీ ఇబ్బంది పెట్టేవే. హైపోథెర్మియా వల్ల పచ్చ పసిరికలు తీవ్రరూపం దాలుస్తాయి. ఆ పరిస్థితి, మరణానికి దారి తీయవచ్చు.

- Advertisement -

ఏం చేయాలి?
శిశువు నిద్రించే గదిలో ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌, నర్సరీలో 28 డిగ్రీల సెల్సియస్‌ ఉండాలి. శరీర ఉష్ణోగ్రత 36.5 డిగ్రీల సెల్సియస్‌ ఉండేలా జాగ్రత్తపడాలి. సర్వో కంట్రోలర్‌ పరికర ఉష్ణోగ్రత.. బిడ్డ శరీర ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గుల ప్రకారం మారుతూ ఉంటుంది. ఆ తేడాలను గమనిస్తూ ఉండాలి. ప్రమాదకరమైన ప్రసవాలు జరిగే ఆస్కారం ఉన్నప్పుడు నర్సరీ ఉన్న పెద్దాసుపత్రిలోనే ప్రసవం జరిగేలా చూసుకోవాలి. ప్రసవం ఇంకెక్కడైనా జరిగినప్పుడు, వెచ్చదనం కోసం శిశువును నర్సరీకి పంపడానికి ‘ట్రాన్స్‌పోర్ట్‌ ఇన్‌క్యుబేటర్‌’ వాడతారు. ఒకవేళ ఇవి అందుబాటులో లేనప్పుడు ఉన్ని దుస్తులలో లేదా దూదిలో శరీరాన్ని కప్పి, వెదురు డబ్బాలో లేదా థర్మోకోల్‌ డబ్బాలో పంపాలి. మార ్గమధ్యంలో శరీరం చల్లబడకుండా, ఆ డబ్బాలో వేడి నీటి సీసాలను ఉంచాలి. అలా అని, బిడ్డ లేత శరీరానికి హాని కలిగించేంత వేడిగానూ ఉండకూడదు.

ఇంట్లోనే జాగ్రత్తలు
హైపోథెర్మియాకు వైద్యం కన్నా నివారణే మేలు. శిశువు అరచేతులు, పాదాలు వెచ్చగా, గులాబీ రంగులో ఉన్నాయో లేదో తరచూ గమనించాలి. చలికాలంలో, తుఫాను సమయంలో శిశువు నిద్రించే గది వెచ్చగా ఉండాలి. 200 వోల్టుల బల్బుగాని, రూమ్‌ హీటర్‌గాని అమర్చి, ఆ గది ఉష్ణోగ్రత 25 డిగ్రీలు ఉండేలా జాగ్రత్త పడాలి. చలిగా ఉన్న రోజు స్నానం చేయించకుండా మధ్యాహ్నం వేడి నీటిలో ముంచిన బట్టతో శరీరాన్ని తుడవచ్చు. స్నానం తర్వాత వెంటనే తుడిచి, దళసరి దుస్తులు వేయాలి.

డాక్టర్‌ కర్రా రమేశ్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement