నాగిరెడ్డిపేట, జూలై 9: హాయిగా నిద్రిస్తున్న తాత, మనుమరాలిని పాము కాటు వేయగా.. చిన్నారి మృతిచెందిన ఘటన మండలంలోని జప్తిజాన్కంపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై రాజు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జోడు శంకరయ్య కుమారుడు సంగమేశ్వర్కు ముగ్గురు కుమార్తెలు. సోమవారం రాత్రి భోజనం చేసిన అనంతరం వైష్టవి(7) తాత శంకర య్య దగ్గర నిద్రించగా.. అమ్మమ్మ వద్ద మరో ఇద్దరు నిద్రించారు. రాత్రి మూడు గంటల సమయంలో తనను ఏదో కరిచిందని వైష్ణవి తెలుపడంతో దుప్పట్లను తీసి చూడగా.. కట్లపాము కనిపించింది. అప్పటికే అది శంకరయ్యను కూడా కాటేసింది. వైష్ణవి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో వైష్ణవి మృతిచెందింది. శంకరయ్య పరిస్థితి విషమంగా ఉన్నదని గ్రామస్తులు తెలిపారు. వైష్ణవి ఎల్లారెడ్డిలోని బ్రిలియంట్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నది.