హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ఒక ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ.. గ్రామాల ముఖచిత్రాన్నే మార్చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలు కొనుగోలు చేసిన ట్రాక్టర్, ట్యాంకర్లు ఆయా పంచాయతీలకు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ఉదయం ట్రాక్టర్, ట్రాలీ ద్వారా చెత్తను సేకరిస్తుండటంతో పారిశుద్ధ్యం మెరుగుపడింది. సాయంత్రం ట్యాంకర్ ద్వారా హరితహారం మొక్కలకు నీళ్లు పోస్తుండటంతో పచ్చదనం పెరిగింది.
గ్రామాల్లో నాటిన మొక్కల్లో దాదాపు 90 శాతం బతికినట్టు అధికారులు చెప్తున్నారు. గతంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు ఒక్కొక్క ట్రిప్పుకు రూ.600 చొప్పున ప్రైవేట్ ట్యాంకర్లకు చెల్లించాల్సి వచ్చేది. వీటిని ఉపాధి హామీ నిధుల నుంచి వెచ్చించేవారు. ఇప్పుడు సొంత ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోస్తుండటంతో ఆ మొత్తాన్ని గ్రామ పంచాయతీల బ్యాంక్ అకౌంట్లలోనే జమచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.180 కోట్లు పంచాయతీల అకౌంట్లలో జమ చేయడం విశేషం. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం గోపాల్పూర్ గ్రామ పంచాయతీకి రూ.20.14 లక్షలు వచ్చాయి.
చాలా గ్రామాల్లో ట్రాక్టర్ కొనుగోలుకు చేసిన ఖర్చులు ఇప్పటికే తిరిగి వచ్చేశాయి. మరికొన్ని గ్రామాల్లో దాదాపు సగం డబ్బులు వచ్చాయి. ఈ ఆదాయం భవిష్యత్తులోనూ కొనసాగనున్నది. ప్రతి గ్రామ పంచాయతీ తప్పనిసరిగా ట్రాక్టర్ కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తొలినాళ్లలో ప్రతిపక్షాలు చేసిన విమర్శలన్నీ అర్థ రహితమని తేలిపోయింది.
పంచాయతీ ట్రాక్టర్ మా గ్రామంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ప్రజలు చెత్తను బయట పడేయకుండా ట్రాక్టర్ వచ్చినప్పుడు వేస్తున్నారు. దీంతో రోగాలు రావడంలేదు. ట్యాంకర్ ద్వారా మొక్కలకు నీళ్లు పోయడంతో దాదాపుగా 95% మొక్కలు బతికాయి. ఉపాధి హామీ పథకం ద్వారా పంచాయతీకి రూ.19 లక్షలు జమయ్యాయి. ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించడం, మొక్కలకు నీళ్లు పోయడంతో గ్రామం క్లీన్ అండ్ గ్రీన్‌గా మారింది.
– చెర్కూరి అండాలు, పోల్కంపల్లి గ్రామ సర్పంచ్, రంగారెడ్డి జిల్లా
మా గ్రామానికి రూ.6 లక్షలు పెట్టి ట్రాక్టర్, ట్యాంకర్ కొన్నాం. మొక్కలకు నీళ్లు పోయడం ద్వారా ఉపాధి హామీ నుంచి రూ.13 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది. డీజిల్, ఇతర ఖర్చులకు పోను మిగిలిన డబ్బులను గ్రామాభివృద్ధికి వాడుకొంటున్నాం. ఒక ట్రాక్టర్‌తోనే నీళ్లు కొట్టడం, పారిశుద్ధ్యం పనులు చేయడం కష్టంగా ఉన్నది. మరో ట్రాక్టర్ కొనాలనుకుంటున్నాం. దానిని పూర్తిగా నీటి కోసం వాడుకుంటాం. ట్రాక్టర్ మా గ్రామానికి ఎంతో ఉపయోగపడింది. గ్రామం నీట్‌గా మారింది. శానిటేషన్ సమస్య లేదు.
– మాట్ల మధు, సర్పంచ్, జిల్లెల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా
