హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ మొత్తం 18 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీలోని అన్ని విభాగాలు, అన్ని సామాజికవర్గాల నేతలు కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలుచేశారు. అధ్యక్ష పదవికి ఇతరులెవ్వరూ నామినేషన్లు దాఖలుచేయకపోవడంతో కేసీఆర్ ఎన్నిక ప్రకటన లాంఛనమే కానున్నది. పార్టీ ఎన్నికల షెడ్యూల్‌ను అనుసరించి ఈ నెల 25న ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పర్యవేక్షకుడు పర్యాద కృష్ణమూర్తి అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఇప్పటివరకు వరుసగా ఎనిమిదిసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇది 9వ సంస్థాగత ఎన్నిక. చివరిసారిగా 2017లో రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నిక జరిగింది. 2019లో పార్లమెంట్ ఎన్నికలు, 2020, 2021లో కరోనా కారణంగా పార్టీ ప్లీనరీ నిర్వహించలేదు. ఈ నెల 25న హైటెక్స్‌లో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారు.