Chhaava | మరాఠీ యోధుడు ఛత్రపతి శంభాజీ జీవిత కథ ఆధారంగా విక్కీకౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛావా’ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్లో శంభాజీ మహారాజ్ నృత్యం చేస్తున్నట్లుగా చూపించారని మహారాష్ట్రకు చెందిన పలువురు మంత్రులు, మేధావుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ సన్నివేశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర చారిత్రక యోధుడు శంభాజీ ఘన వారసత్వాన్ని గౌరవించాలని, ఆయన చరిత్రను వక్రీకరించొద్దని, సున్నితమైన అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.
ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు లక్ష్మణ్ ఊటేకర్ వివాదస్పద నృత్యంపై వివరణ ఇచ్చారు. ఛత్రపతి శంభాజీ 20ఏళ్ల వయసులో యుద్ధాన్ని గెలిచి వచ్చిన సందర్భంలో ఆయన నృత్యం చేస్తున్నట్లు చూపించామని, ‘ఛావా’ అనే పుస్తకంలో రాసిన విధంగానే తాము ఆ సన్నివేశాన్ని తెరకెక్కించామని తెలిపారు. “లెయిమ్’ అనే నృత్యం మహారాష్ట్ర సంస్కృతిలో భాగం. అందుకే ఆ సన్నివేశాలను చిత్రీకరించాం. అయితే అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ ఆ డ్యాన్స్ సీక్వెన్స్‌ను సినిమా నుంచి తీసివేయబోతున్నాం. చరిత్రకారులకు ఈ నెల 29న సినిమాను ప్రదర్శించి వారి సలహాలు, సూచనలు తీసుకొని సినిమాలో మార్పులు చేస్తాం’ అని లక్ష్మణ్ ఊటేకర్ పేర్కొన్నారు. దీంతో ఈ వివాదానికి తెరపడ్డట్లయింది. ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్ భార్య యేసుబాయిగా రష్మిక మందన్న నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది.