70వ దశకం తర్వాత విప్లవ రచయితల సంఘం, జననాట్యమండలి సంస్థలు సాహిత్య సాంస్కృతిక రంగంలో చేసిన కృషి, సమాజంపై వేసిన ప్రభావం మిక్కిలి ప్రభావశీలమైనది. గద్దర్ పాటలు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించటమే కాదు, పోరాట మార్గాన నడిపించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 70ల నుంచి 90ల దాకా గద్దర్ పాట పోరుబాట అయింది.
గద్దర్ రచించిన ‘రాజకీయ వీధి బాగో తం’ చాలా ప్రచారం పొందిన రూప కం. ఆయన ఆధ్వర్యంలో జననాట్యమండలికి చెందిన కళాకారులు సంజీవ్, దివాకర్, డప్పు రమేశ్, డోలక్ దయ లాంటివారు రాష్ట్రమంతటా పర్యటించి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ‘నక్సల్బరి బిడ్డలు’ ఒగ్గుకథతో నక్సల్బరీ పోరాటానికి తెలంగాణలో ఊపిరి పోశారు. డప్పు రమేశ్ పాటలు చాలా ప్రచా రం పొందాయి. విప్లవ పాటల్లో డప్పు, చిం దులు ప్రాధాన్యం వహించాయి. తమ భావా లు, సిద్ధాంతాలు ప్రజలకు చేరాలంటే.. సరళమైన భాష, అర్థవంతమైన భావం పాటకు అవసరమని విప్లవకవులు గుర్తించారు. విర సం కవులు శివసాగర్, గద్దర్, వంగపండు, గూడ అంజయ్య, సుధ తదితరుల గేయాలు నాటి తెలుగు సమాజాన్ని తీవ్రంగా ప్రభావి తం చేశాయి, నడిపించాయి. ప్రాచీన కాలం లో శివ కవులు కూడా ఇదేవిధంగా తమ మత ప్రచారానికి జాను తెలుగును, ద్విపదలను చేపట్టారు. భక్తితత్వ కవులు కూడా తమ భావాలను గేయాలుగా, పాటలుగా రచించి ప్రజల దగ్గరికి తీసుకెళ్లారు. ఆ మార్గంలోనే విరసం కవులు పాటను తూటా గా సమాజ మార్పు కోసం సంధించారు.
విరసం భావాలను ప్రచారం చేస్తూ వరంగల్ నుంచి వరవరరావు ‘సృజన’ అనే సాహి త్య పత్రికను నడిపాడు. ఆయన తన రచన లు, ప్రసంగాల కారణంగా ఎన్నోసార్లు జైలుకు వెళ్లాడు. ‘జీవనాడి’, ‘స్వేచ్ఛ’, ‘సముద్రం’, ‘భవిష్యత్ చిత్రపటం’ అనే కావ్య సంపుటాలుగా వరవరరావు కవిత్వం వచ్చింది. కాళీపట్నం రామారావు, రావిశాస్త్రి, అల్లం రాజ య్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, సాహు, సాధన, వసంతరావు దేశ్పాండే, పులి ఆనందమోహన్, భూషణం, బి.ఎస్.రాములు, కాలువ మల్లయ్య, సదానంద శారద, జి.కళ్యాణరావు, వి. చెంచయ్య, పులుగు శ్రీనివాస్ మొదలైన రచయితలెందరో విప్లవ చైతన్యాన్ని ప్రబోధిస్తూ కథలు, నవలలు, కవి త్వం రాశారు. విప్లవ రచయితల సాహిత్యం భావ తీవ్రతతో కూడి తెలుగు నుడికారంతో చక్కని వచన శైలిలో వికసించింది. ఈ రచయితలు వారివారి మాండలికాలను ప్రయోగించి బలమైన రచనలు చేశారు. సమాజంలోని దోపిడీ పీడనలను, దౌర్జన్యాలను తమ సాహిత్యంలో చిత్రించి ప్రజాసామాన్యంలో చైతన్యం తెచ్చారు.
‘ఈ దొంగల రాజ్యాంగం/ రచనే ఒక కుట్ర’ అంటూ.., ‘శ్రమజీవుల శ్వాసలతో/ పాడుదాం పాడుదాం..’ అని అంటాడు చెరబండరాజు. ‘పాపాలకు మేలి ముసుగు/ పార్లమెంట్ అసెంబ్లీలు, మోసానికి మారుపేరు/ దగాకోరు ఎలక్షన్లు’ అని విప్లవ కవుల అభిప్రాయం. మతంలోని కర్మసిద్ధాంతం, పూర్వజన్మలు, వర్ణాశ్రమ ధర్మం పేరుతో భూ స్వాములు దోపిడీ పీడనలను కొనసాగించా రు. దీనినుంచి విముక్తికి.. దున్నేవాడికే భూమి కావాలనేది విరసం అభిలాష.
‘పొలాలల్లో అడవుల్లో/ ఫ్యాక్టరీల సమ్మెల్లో చంపబడ్డ రాక్షసులం/ రాజద్రోహులం, హంతకులం ఉరికంబం ఎక్కేవాళ్లం అంతా మనమే..’అని చెరబండరాజు అంటాడు. విరసం రచయితలు అంటరానితనాన్ని నిరసించారు. ఈ సమస్యను కూడా తెలంగాణ విరసం కవు లు పరిశీలనలోకి తీసుకున్నారు. దీనికి పరిష్కారం కూడా విప్లవంలో ఉందన్నారు.
‘ఒక్కడేమో నన్ను/ అంటరాని వాడంటే మరొకడేమో హరిజనుడు/ ఇంకో గాడిద కొడుకేమో నీచుడని పిలువడం అలవాటే/ ఎవడు ఎలా పిలిస్తే నాకేం నేనొక నక్సలైట్నైనప్పుడు..’ అని ‘ఎర్రజెండా’ కవితలో సలంద్ర ధైర్యంగా అంటాడు.
ముదిగంటి ,సుజాతారెడ్డి
99634 31606