Boris Johnson on WFH | కరోనా మహమ్మారి వల్ల వర్క్ ఫ్రం హోం సంస్కృతి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతానికి కేసులు తగ్గుముఖం పట్టడంతో కొన్ని సంస్థలు హైబ్రీడ్ వర్క్ కల్చర్ అమలు చేస్తుండగా, మరికొన్ని యాజమాన్యాలు.. సిబ్బందిని ఆఫీసులకు రమ్మంటున్నాయి. కానీ వర్క్ ఫ్రం హోం ఎత్తేస్తే ఉద్యోగులు రాజీనామా చేయడానికి వెనుకాడటం లేదు. ఈ పరిస్థితిపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భిన్నంగా స్పందించారు. వర్క్ ఫ్రం హోం వల్ల మనం చేస్తున్న పనేమిటో మరిచిపోతామని సంచలన వ్యాఖ్య చేశారు. తన మాటలు ఇతరులకు నచ్చకపోవచ్చని కూడా చెప్పారు.
వర్క్ ఫ్రం హోం వల్ల ఉద్యోగుల దృష్టి మళ్లుతూ ఉంటుంది. ఈ పాలసీ అమలులో తనకు ఇటువంటి అనుభవమే ఎదురైందన్నారు బోరిస్ జాన్సన్. ఇంటి వద్ద పని చేస్తున్నప్పుడు మరో కాఫీ తెచ్చుకోవడానికి సమయం వెచ్చిస్తామన్నారు. తర్వాత అల్పాహారం, ఇతర ఆహార వస్తువుల కోసం ఫ్రిజ్ వద్దకు వెళ్తాం అని చెప్పారు. తిరిగి ల్యాప్ాప్ వద్దకు వచ్చి కూర్చుంటే మనం చేస్తున్న పనేమిటో కూడా గుర్తుకు రాదన్నారు. అందుకు వివిధ సంస్థల్లో పని చేస్తున్న సిబ్బంది ఆఫీసులకు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.