న్యూఢిల్లీ : మార్చి నెలలో బ్యాంకులకు వరుస సెలవలు రావడంతో పాటు సమ్మెల ప్రభావంతో కస్టమర్లు తమ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాల్సిన పరిస్ధితి నెలకొంది. ఈనెల 15 నుంచి రెండు రోజుల సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు పిలుపు ఇచ్చాయి. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపుఇవ్వడంతో ఆయా రోజుల్లో బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. మార్చి 13 రెండో శనివారం, మార్చి 14 ఆదివారం బ్యాంకులకు సెలవు కాగా, ఆపై 15, 16 తేదీల్లో సమ్మె కారణంగా వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు.
దీంతోపాటు నాలుగు ఆదివారాలు, రెండు సెకండ్ సాటర్డేలతో మార్చిలో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకులు మూసివేస్తారు. ఆర్బీఐ ప్రకటించిన హాలిడే క్యాలెండర్ ప్రకారం మార్చిలో 5, 11, 22, 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. మరోవైపు ఈనెలలో మహాశివరాత్రి, హోలి పర్వదినాలు రావడంతో కూడా బ్యాంకులకు భారీగా సెలవు దినాలు వచ్చాయి. కస్టమర్లు బ్యాంకు సెలవులు, సమ్మెలను దృష్టిలో ఉంచుకుని తమ పనులను ప్లాన్ చేసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.