ఇంద్రవెల్లి : ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత చదువులు ( Higher Education ) చదువుకుంటే సమాజంలో మార్పులు వస్తాయని ఉట్నూర్ ఐటీడీఏ డీడీ జాదవ్ అంబాజీ ( DD Jadhav Ambaji ) అన్నారు. శుక్రవారం మండలంలోని నాగోబా ఆలయంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంద్రవెల్లి, కెస్లాపూర్, పిట్టబోంగురం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలకు చెందిన 200 మంది విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు.
కెస్లాపూర్ నాగోబా ఆలయ పూజారి మెస్రం షేకు ఆధ్వర్యంలో సరస్వతి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి చదువుల ప్రాధాన్యత పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు దుస్తులు ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా అందుతుందని అన్నారు. కార్యక్రమంలో ఏసీఎంవో జగన్, జీసీడీవో ఛాయాదేవి. మండల విద్యాధికారి మనుకుమార్, కెస్లాపూర్ గ్రామపటేల్ మెస్రం వెంకట్ రావ్ పటేల్, మాజీ సర్పంచ్ మెస్రం నాగ్ నాథ్, నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్ రావ్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.