ప్రతి నాలుగు నెలలకోసారి ప్రకృతి తన రూపును మార్చుకుంటుంది. వేసవి వేడిని వర్షాకాలం చల్లబరుస్తుంది. వర్షాకాలపు పచ్చదనాన్ని చలికాలం హత్తుకుంటుంది. కానీ, మన ఇల్లు మాత్రం ఏళ్ల తరబడి ఒకే రూపంలో, ఒకే అమరికలో, ఒకే రంగులతో కనిపిస్తుంటుంది. అందుకే ఇప్పుడు ప్రపంచ ఇంటీరియర్ డిజైనర్లు ‘సీజనల్ హోమ్ స్టయిలింగ్ ట్రెండ్’కు తెరతీశారు. రుతువులకు అనుగుణంగా ఇంటిని అలంకరించుకోవడం అనే ఆలోచన ఇది. అలా అని కొత్త సామాన్లు కొనడమేం కాదు… కాలంతో పాటు ఇంటి అనుభూతినీ మార్చే ప్రయత్నం.
వేసవిలో ఇంట్లోకి ఎకువ సహజ కాంతి వచ్చేలా కిటికీలను తెరవడం, పత్తితో చేసిన లేత రంగుల తెరలు, దిండు కవర్లు ఉపయోగించడం, గాజు పాత్రల్లో తాజా పూలు ఉంచడం, మట్టి కుండీల్లో పచ్చని మొకలను అమర్చడంలాంటివి ఇంటికి చల్లదనాన్ని తెస్తాయి. వర్షాకాలంలో వెదురు, జనపనార, మట్టి వంటి సహజ పదార్థాలతో చేసిన అలంకరణలు, వెచ్చటి పసుపు వెలుతురునిచ్చే దీపాలు లోగిలికి హాయిని జతచేస్తాయి. చలికాలంలో చేతితో నేసిన దుప్పట్లు, చెకతో చేసిన అలంకరణ వస్తువులు, ముదురు మట్టి రంగులు లేదా గోధుమ ఛాయల దిండ్లు ఇంటికి వెచ్చదనాన్ని చేకూరుస్తాయి. ఈ విధానంలో ముఖ్యమైన విషయం కొనుగోలు కాదు… మార్పు. ఒకే తెరలను ఏడాది పొడవునా ఉపయోగించకుండా రుతువుకు తగ్గట్టుగా ఎంచుకోవడం, భోజనాల బల్లపై కాలానుగుణమైన పూలు లేదా పండ్లను అలంకరించడం, సోఫాపై ఉండే దిండు కవర్లు, గదిలోని అలంకరణ వస్తువుల స్థానాన్ని మార్చడం… ఇలాంటి చిన్న పనులే ఇంటిని కొత్తగా కనిపించేలా చేస్తాయి. రుతువుల సోయగాన్ని ముంగిట్లోకి ఆహ్వానిస్తాయి.