Magma Ocean | న్యూఢిల్లీ, ఆగస్టు 21: చంద్రుడి ఉపరితలం మొత్తం ఒకప్పుడు శిలాద్రవ సముద్రమే అనే వాదనను ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 డాటా సైతం ధ్రువీకరించింది. ఈ మేరకు అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీతో పాటు పలు సంస్థలకు చెందిన అధ్యయనం వివరాలు ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. గతంలో నాసాకు చెందిన అపోలో, సోవియెట్ యూనియన్‌కు చెందిన లూనా చంద్రుడి నాడీమండల, మధ్య అక్షాంశ ప్రాంతాల నమూనాలను సేకరించాయి. వీటిని అధ్యయనం చేసిన తర్వాత చంద్రుడిపై ఒకప్పుడు శిలాద్రవం ఉండేదనే అభిప్రాయానికి శాస్త్రవేత్తలు వచ్చారు.
అయితే, చంద్రయాన్-3లో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ మాత్రం చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి డాటాను పంపించింది. ఈ డాటాను అధ్యయనం చేసిన పరిశోధకులు దక్షిణ ధ్రువంపై కూడా శిలాద్రవమే ఉండేదని గుర్తించారు. అంతేకాదు, చంద్రుడి ఉపరితలం మొత్తం ఫెర్రోన్ అనార్థోసైట్(ఎఫ్ఏఎన్) అనే ఒకే రకమైన రాయితో ఏర్పడిందని సైతం పరిశోధకులు గుర్తించారు. శాస్త్రవేత్తల ఊహిస్తున్న దాని ప్రకారం.. రెండు ప్రోటోప్లానెట్లు ఢీకొనడం వల్ల చంద్రుడు ఏర్పడ్డాడు. ఫలితంగా చంద్రుడు చాలా వేడిగా మారిపోయాడని, వేడికి ఉపరితలం కరిగి శిలాద్రవ సముద్రంగా మారిందని పరిశోధకులు తెలిపారు.
చెన్నై, ఆగస్టు 21: భారత్ మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ‘రూమీ-1’ ప్రయోగానికి సిద్ధమైంది. ఆగస్టు 24న చెన్నైకి సమీపంలోని ‘మొబైల్ లాంచ్‌ప్యాడ్’ నుంచి ఈ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపుతున్నట్టు తమిళనాడుకు చెందిన టెక్ కంపెనీ ‘స్పేస్ జోన్ ఇండియా’ సీఈవో ఆనంద్ మేగలింగం తాజాగా ప్రకటించారు. ఈ ప్రయోగంలో.. హైబ్రిడ్ రాకెట్ ‘పేలోడ్’ తిరిగి సముద్రంలో పడ్డాక దానిని సేకరించి, తిరిగి రాకెట్ ప్రయోగంలో ఉపయోగిస్తారు. పునర్వినియోగ రాకెట్లను అభివృద్ధి చేయటం, ఖర్చును తగ్గించటం ‘రూమీ-1’ ప్రయోగం లక్ష్యమని ఆయన తెలిపారు.