న్యూఢిల్లీ : టమాట ధరల మంట కొనసాగుతుంటే ఉల్లి ధరలూ (Onion Prices) ఘాటెక్కాయి. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కొండెక్కడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరలను కిందికి దింపేందుకు తన వద్ద ఉన్న మిగులు నిల్వను మార్కెట్లోకి విడుదల చేసేందుకు కేంద్రం సంసిద్ధమైంది. 2023-24లో మిగులు నిల్వ కింద మూడు లక్షల టన్నుల ఉల్లిని నిల్వ చేస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
2022-23లో సీజన్లో కేంద్రం 2.51 లక్షల టన్నుల ఉల్లిని మిగులు నిల్వల కింద నిర్వహించింది. సరఫరాలు తగ్గి ధరలు అమాంతం ఎగబాకితే ధరల స్ధిరీకరణ కోసం ప్రభుత్వం మిగులు నిల్వలను సిద్ధం చేస్తుంది. నాఫెడ్, ఎన్సీసీఎఫ్ సహా పలు వ్యవసాయ మార్కెటింగ్ సంస్ధల ఎండీలతో ఆహార పౌరసరఫరాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ భేటీ సందర్భంగా మిగులు నిల్వల నుంచి ఉల్లిని మార్కెట్లోకి విడుదల చేసే వివరాలను తెలిపారు.
ఉల్లి నిల్వల విడుదలపై విధివిధానాలను ఖరారు చేశారు. దేశవ్యాప్త సగటు కంటే ఉల్లి రిటైల్ ధరలు అధికంగా ఉన్న ప్రాంతాలు, కీలక మార్కెట్లు లక్ష్యంగా ఉల్లి నిల్వలను విడుదల చేయాలని నిర్ణయించామని ఆహార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ-వేలం, ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలపై రిటైల్ సేల్స్ ద్వారా మిగులు నిల్వలను విడుదల చేయడంపైనా కసరత్తు సాగిస్తున్నామని పేర్కొంది.
Read More :
Cyber Fraud | వాటి వలలో పడకండి.. డేటింగ్ యాప్స్ యూజర్లకు కేంద్రం వార్నింగ్!