హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఎస్ఎల్బీసీ టన్నెల్, కాళేశ్వరం పునరుద్ధరణ పనులకు నిపుణులైన మరో ఆర్మీ అధికారిని డిప్యుటేషన్‌పై పంపేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ముగ్గురు అధికారుల పేర్లను ప్రభుత్వానికి పంపుతూ, వారిలో ఒక ఆఫీసర్‌ను ఎంచుకోవాలని రాష్ర్టానికి సూచించింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల న్యూఢిల్లీలో భారత సైన్యాధిపతి జనరల్ ధీరజ్ సేథ్‌ను ఆయన అధికారిక నివాసంలో ప్రత్యేకంగా కలిసి ఆర్మీ ఇంజినీరింగ్ అధికారులను తెలంగాణకు డిప్యుటేషన్‌పై పంపించాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్స్‌లోని మిలిటరీ సెక్రటరీ విభాగం తెలంగాణ ప్రభుత్వానికి ముగ్గురు ఆర్మీ అధికారుల పేర్లను లెఫ్టినెంట్ కల్నాల్ సత్యదేవ్సింగ్, లెఫ్టినెంట్ కల్నాల్ రంజిత్ ఏ మీనన్, లెఫ్టినెంట్ కల్నల్ హెచ్వీ భల్లా పేర్లను డిప్యుటేషన్‌పై పంపేందుకు ప్రతిపాదించింది.
వారిలో ఒకరిని ఎంచుకోవాలని సూచించింది. ఆర్మీ ప్రధాన కార్యాలయానికి, జనరల్ ధీరజ్ సేథ్‌కు మంత్రి ఉత్తమ్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్రం ప్రతిపాదించిన ముగ్గురి సేవలను వినియోగించుకోవాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ముగ్గురు అధికారుల్లో ఒకరిని ఎస్ఎల్ బీసీ సొరంగం రెండు వైపులా జరుగుతున్న తవ్వకం పనుల పర్యవేక్షణకు, మిగిలిన ఇద్దరు అధికారులను మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు నియమించాలని భావిస్తున్నట్టు వెల్లడించారు.