Postmortem after Sunset | కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పోస్ట్మార్టమ్లపై కీలక నిర్ణయం తీసుకున్నది. అన్ని రకాల మౌలిక వసతులు ఉన్న దవాఖానల్లో సూర్యాస్తమయం తర్వాత అంటే రాత్రి వేళల్లో కూడా పోస్ట్‌మార్టం నిర్వహించవచ్చునని పేర్కొంటూ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనివల్ల మృతుల కుటుంబ సభ్యులకు, అవయవదానం కోసం వేచి చూస్తున్న వారికి బెనిఫిట్ చేకూరుతుందని తెలిపింది.
సోమవారం సూర్యాస్తమయం తర్వాత నుంచి పోస్ట్‌మార్టం ప్రొటోకాల్‌లో మార్పులు తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మృతుడి కుటుంబం, బంధు మిత్రులు.. నిర్దిష్ట టైంలో అవసరమైన వారికి అవయవ దానం, అవయవ బదిలీ (transplant as organs)ని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది.
మెడికో లీగల్ కేసులు, ఆత్మహత్యలు, నర హత్య, లైంగికదాడి-హత్య తదితర కేసులకు సంబంధించి శాంతిభద్రతల అంశం తలెత్తితే తప్ప రాత్రి వేళ పోస్ట్‌మార్టం తప్పనిసరి కాదని తెలిపింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు, ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది.
మెడికోలీగల్ కేసులకు చట్టప్రకారం పోస్టుమార్టం చేస్తారు. అయితే, అలాంటి మృతదేహాలకు ఇప్పటివరకు పగలు మాత్రమే పోస్టుమార్టం చేసేందుకు చట్టం అనుమతిస్తోంది. దీంతో కొన్నిసార్లు పోస్టుమార్టం కోసం గంటలతరబడి దవాఖానల్లోనే మృతదేహాన్ని ఉంచాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్టుమార్టం చేయడానికి వీలు కల్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.