సిద్దిపేట ప్రతినిధి/ సిద్దిపేట, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతులకు అన్యాయం చేయాలని చూస్తే టీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, అన్నదాతల కోసం ఎంతకైనా పోరాడుతామని, ఉద్యమాలకు వెనుకాడమని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని ఆర్డీవో కార్యాలయం వద్ద నిర్వహించిన రైతు మహాధర్నాలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా శర్మ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాసంగి వడ్లు కొనేవరకు పోరాటం ఆపమన్నారు. ఇది ఆరంభం మాత్రమేనన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు కరెంట్, ట్రాన్స్ఫార్మర్లు, ఎరువులు, విత్తనాలు, సాగునీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. తెలంగాణ తెచ్చాక అన్ని ఇబ్బందులు తీర్చినట్లు తెలిపారు. ప్రభుత్వ చేయూతతో తెలంగాణలో రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారని, భారీగా పంటలు సాగు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ప్రభుత్వం ఆ సమగ్ర నిర్ణయాలు, రైతులపై గల మొండి వైఖరి రైతులకు శాపంగా మారాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్ కోసం విత్తనాల కోసం ధర్నాలు చేశామని కానీ, స్వరాష్ట్రంలో వీటి బాధలు రైతులకు లేకుండా గోదావరి జలాలు, 24 గంటలు, రైతుబంధు పెట్టుబడి, రైతు బీమా వంటి పథకాలతో సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే అజెండాగా పని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో బోర్లు వేసే బండ్లు, మోటారు రిపేరు చేసే దుకాణాలు ముసుకుపోయాయన్నారు.
దాని ఫలితంగా రాష్ట్రంలో నేడు పంట పుష్కలంగా పండి రైతులు ఆనందంగా ఉన్న సమయంలో కేంద్రం యాసంగిలో వడ్లు కొనమని చెప్పి రైతులకు అన్యాయం చేసే చర్యలకు దిగుతుందని ఆరోపించారు. పంజాబ్‌లో కొన్న మాదిరిగా తెలంగాణలోని ధాన్యం సేకరించాలని, లేకపోతే కేంద్రంతో పోరాటం తప్పదని మంత్రి హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతుల కంట్లో కన్నీరు కారిస్తే.. నేడు సీఎం కేసీఆర్ రైతుల పొలాల్లో గోదావరి నీళ్లు పారిస్తున్నారన్నారు. రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. కేంద్రం వడ్లు కొనమని చెబుతుంటే, ఇక్కడ బీజేపీ నాయకులు వడ్లు కొనాలని ధర్నాలు చేయడం ‘దొంగే దొంగ’ అన్న అరిచినట్లుగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. రైతుల గోసం కేంద్రానికి పట్టడం లేదన్నారు. పెట్రో, డీజిల్ ధరలపై బీజేపీ ఆధ్వర్యంలో ని సోషల్ మీడియా దేశ ద్రోహులుగా ప్రచారం చేస్తున్నదని మంత్రి విమర్శించారు. దొడ్డు వడ్లు కొనాలని ప్రధానికి ప్రతి ఒక్కరూ ట్విట్టర్లో ట్వీ ట్లు చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులకు రైతుల ఓట్లు కావాలి గానీ, వారి సమస్యలు పట్టావా..? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. బీజేపీ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని టీఆర్ఎస్ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఏ పిలుపు ఇచ్చినా విజయవంతం చేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మంత్రి హరీశ్‌రావు కోరా రు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాజలింగం, సిద్దిపేట నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
వరి వేయకపోతె బతుకెట్ల…!
కొన్నేండ్లుగా వరి పంటనే ఆధారంగా చేసుకుని బతుకుతున్నం. మధ్యాంతరంగా వరిని ఆపివేసి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలంటే ఎలా? కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయం అని చెప్పడంతోనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎదురైందన్నారు. మా తలాపునే సింగూరు ప్రాజెక్టు పుష్కలంగా నిండు కుండలా ఉంది. కెనాల్ కాలువలు ఉన్నాయి, ఆ కాల్వల ద్వారా సాగుకు నీటిని వదులుతుండటంతో సాగుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నది. ఈ ఏడాది నాకున్న పది ఎకరాల్లో వరి పంటను సాగు చేశాను. ఈసారి వరి వద్దంటే ఎవుసాన్ని నమ్ముకుని బతుకుతున్న మాకుటుంబం ఏం కావాలి. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ పంటలు అంటే ఏ పంటలు వేయాల్నో అర్థం కావడం లేదు.
కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి..
ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ పంటలు వేయండి అంటే వాటి గురించి తెలియని మేము ఏ పంటను వేయాలో దిక్కుతోస్తలేదు. రైతుల బాధలు తెలుసుకుని కేంద్ర ప్రభుత్వమే మరోసారి ఆలోచించుకోవాలి. రైతుల పక్షాన ఆలోచించి కేంద్ర ప్రభుత్వమే యాసంగిలో వరి పంటలను పండించుకునేలా అవకాశం కల్పించి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి. ఈసారి మూడెకరాల్లో వరి పంటను సాగు చేశాను.
రైతు గోస తెలిసిన ముఖ్యమంత్రి
గీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఊర్లనే వడ్లు కొంటుర్రు. వడ్లు పొంగానే బ్యాంకులో పైసలు వెంబడే వేస్తున్నారు. మొదటి నుంచి రైతుల గోసలు చూసిన కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పంటకు పెట్టుబడి పైసలు ఇవ్వడంతోపాటు రైతుబీమా కల్పించి రైతు కుటుంబాలకు పెద్దదిక్కైండు. గా పువ్వు గుర్తు అని చెప్పుకునేటోళ్లు రైతులకు ఏం చేసింది లేదు. మా కేసీఆర్ సార్‌కు కొట్లాట కొత్తేం కాదు. రంగంలో దిగిండు అంటే అది ఖచ్చితంగా మాలాంటోళ్లకు మంచి జరుగుతుంది. కేసీఆర్ సార్ రైతు గోస తెలిసిన ముఖ్యమంత్రి.
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు..
ఎవరైనా సరే రైతులకు ఇబ్బంది కలిగించే పనులు చేయద్దు. రైతుల ఏడ్చిన చోట రాజ్యం నిలబడదంటరు. అలాంటి పరిస్థితి మనకు రావద్దు. మోడీ సర్కారు రైతన్నలకు అన్యాయం చేయకుండా సూడాలే. రాజకీయాల కోసం రైతన్నలకు ఇబ్బందులు పెట్టొద్దు.