సూర్యాపేట, అక్టోబర్ 03 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని, ఢిల్లీలో సీఈఓ జ్ఞానేశ్వర్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం జాతీయ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం వాణిజ్యభవన్ కార్యదర్శి బొమ్మిడి లక్ష్మినారాయణ అన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక వాణిజ్యభవన్ సెంటర్ లో తీవ్ర నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. నగదు రహిత లావాదేవీలను ప్రజలకు అలవాటు చేసి ప్రస్తుతం యూపీఏ చార్జీలు విధిస్తామనడం దారుణమన్నారు. యూపిఏ చార్జీలకు వ్యతిరేకంగా మోదీ నాయకత్వం వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో 600ల సంఘాలు రోడ్డెక్కారని మోదీ ప్రబుత్వం ఆగమయ్యే రోజు దగ్గరపడిందన్నారు. అలాగే ఉపాధి హామీ పథకాన్ని పేరుమార్చి కొత్త నిబందనలు పెట్టడంతో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాత పథకాన్ని పునరుద్దరించాలన్నారు.
అలాగే సర్ ప్రక్రియ మొత్తం తప్పుల తడకగా ఉందని చనిపోయిన ఓట్లు, డూప్లికేట్ ఓట్లు తీసివేయడంలో తప్పు లేదు కాని అక్షరదోషాలున్న ఓట్లను కూడా తీసివేయడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రధాని నరేంద్రమోదీ అవలంభిస్తున్న దుర్మార్గ విధానాలను ప్రజాక్షేత్రంలో సీపీఎం ఎండగడుతుందన్నారు. అలాగే ఇటివల 150మంది ప్రయాణికులను కాపాడిన పైలట్‌కు పరమ వీర చక్ర అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓలంపిక్ పోటీల్లో ఇండియా తరపున పథకాలు సాధించిన క్రీడాకారులను ఆయన అబినందించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బత్తిని సైదులు, భూపాల్, అంజన్న, ఉప్పనపల్లి శ్రీను, లింగస్వామి, మంద శ్రీను, ఆసీప్, త్రివేణి, యమున, వెంకన్న పాల్గొన్నారు.