న్యూఢిల్లీ: నీట్-రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రప్రభుత్వం సమాధానమిచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వార్షిక ఆదాయ పరిమితిని రూ.8 లక్షలుగా నిర్ణయించడాన్ని సమర్థించుకున్నది. కమిషన్ నివేదికలు, సంబంధిత వర్గాలతో సమగ్రస్థాయిలో సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. 2010లో మేజర్ జనరల్ సిన్హా కమిషన్ ఇచ్చిన నివేదికతో పాటు ప్రస్తుత ఆదాయ పరిస్థితులు, పౌరుల జీవన ప్రమాణాలను ఇందుకు ప్రాతిపదికగా తీసుకున్నట్టు వివరించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉండి.. పన్ను విధించే పరిమితి కంటే తక్కువ వార్షికాదాయం కలిగిన జనరల్ క్యాటగిరీ వర్గాల వారిని ఈడబ్ల్యూఎస్‌గా పరిగణించవచ్చని సిన్హా కమిషన్ నివేదిక పేర్కొన్నట్టు వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి, ఓబీసీ సంపన్న శ్రేణుల (క్రీమీలేయర్) వర్గాలకు వార్షికాదాయ పరిమితి రూ.8 లక్షలుగా నిర్ణయించడంపై వివరణ ఇస్తూ.. ఆర్థికంగా బలోపేతమైన వర్గాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు అందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఓబీసీ క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని రేషనల్ విధానంలో రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 16 ప్రకారమే నిర్ణయించినట్టు వెల్లడించింది.
కేసు పూర్వపరాలివీ..
‘ఓబీసీల్లో రూ.8 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారిని సంపన్న శ్రేణిగా గుర్తించి వారికి రిజర్వేషన్ల సౌకర్యం కల్పించడం లేదు. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు మాత్రం రూ.8 లక్షల ఆదాయం ఉన్నా రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఇదెలా సమర్థనీయం?’ అంటూ ఇటీవల సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వార్షిక ఆదాయం రూ.8 లక్షలు మించని వారిని ఈడబ్ల్యూఎస్‌గా గుర్తించాలన్న నిబంధనకు ఏ విషయాలను ప్రాతిపదికగా తీసుకున్నారు? ఇందుకు ఏమైనా అధ్యయనం చేశారా? అని అడిగింది. నీట్ పరీక్షల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయమై దాఖలైన వ్యాజ్యం విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు ప్రశ్నించింది. ఈ క్రమంలోనే కేంద్రం మంగళవారం ప్రమాణపత్రాన్ని దాఖలు చేసింది. కాగా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీ రిజర్వేషన్ల అంశంపై తీర్పు వెలువరించే వరకు నీట్-పీజీ కౌన్సెలింగ్‌ను నిర్వహించబోమని సుప్రీంకు సోమవారం కేంద్రం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.