చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్ 4 : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సిమెంట్, సీకు తక్కువ ధరకు అందివ్వాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలో బుధవారం నారాయణపురం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పత్రాలను ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే వారు పేదవారు కావడంతో వారికి తక్కువ ధరకు సీకు, సిమెంట్ అందజేసేలా ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుని కోరారు. మునుగోడు నియోజకవర్గంలోని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా కృషి చేస్తానని చెప్పారు.
జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ.. జూన్ చివరి నాటికల్లా బిస్మెంట్ నిర్మాణం పూర్తి చేయాలని, లేదంటే లబ్ధిదారుల స్థానంలో మరొకరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఇంటి నిర్మాణం 400 స్క్వేర్ ఫీట్ తక్కువ కాకుండా 600 స్క్వేర్ ఫీట్స్ కు ఎక్కువ కాకుండా నిర్మాణం చేపట్టాలని తెలిపారు. లేనట్లయితే పథకం వర్తించదన్నారు బీస్మెంట్ పూర్తైన పిదప లక్ష రూపాయలు, గోడలు పూర్తి అయినట్లయితే లక్ష రూపాయలు, స్లాబ్ వేసినప్పుడు రెండు లక్షలు ఇంటి నిర్మాణం పూర్తి చేసినప్పుడు మరో లక్ష రూపాయలు అందజేస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, చౌటుప్పల్ నారాయణపురం మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.