న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 : ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వర్ పదవికాలాన్ని రెండేండ్లు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో మార్చి 2027 వరకు ఆయన సీఈఏ పదవిలో కొనసాగనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అపాయింట్మెంట్ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. జనవరి 28, 2022న నాగేశ్వరన్ పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రూపొందించే ఆర్థిక పాలసీలపై సలహాలతోపాటు బడ్జెట్ కంటే ముందు పార్లమెంట్‌కు సమర్పించే ఆర్థిక సర్వేను ఆయన రూపొందించాల్సి ఉంటుంది.
నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం పదవీ కాలాన్ని ఓ ఏడాదిపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన ఈ పదవిలో 2023 ఫిబ్రవరిలో నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం పొడిగింపును క్యాబినెట్ కమిటీ ఆమోదించింది.