హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీలోని న్యాయ నిపుణుల సలహా తీసుకొన్న తర్వాతే సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అయితే, కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ పూటకో మాట, రోజుకో తీరులా వ్యవహరిస్తున్నది. సోమవారం మేడిగడ్డకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని, నీళ్లు పారిస్తామని ప్రకటించారు. తీరా మూడు రోజుల్లోనే మళ్లీ మాట మార్చారు. మరో సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. కాళేశ్వరంపై మరోసారి మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించామని వెల్లడించారు. సబ్ కమిటీలో ప్రాజెక్టుపై ఎలా ముందుకెళ్లాలో, ఏం చేయాలో చర్చిస్తామని తెలిపారు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా మంత్రివర్గం చర్చించామని తెలిపారు. పిటిషనర్లకు నోటీసులు ఇవ్వలేదనే సాంకేతిక కారణాలను హైకోర్టు తప్పుబట్టిందని పేర్కొన్నారు. ఈ నివేదికలో వారిపై ప్రస్తావించిన అంశాలు అమల్లో ఉండవని, వాటి ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం జీవో జారీ చేసిందని, 9 నెలలైనా సీబీఐ దర్యాప్తు ఇంకా ప్రారంభం కాలేదని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. దర్యాప్తు చేయాలని ప్రభుత్వం తరఫున మరోసారి సీబీఐని కోరాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు. ఆర్టీసీ సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిషరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని పేర్కొన్నది. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అధ్వర్యంలో శుక్రవారం జరిగే చర్చలకు రావాలని కార్మిక సంఘాలకు మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది.
ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను తీర్చేందుకు 100 రోజుల ప్రణాళికను సిద్ధంచేస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులకు రూ.6,200 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు రూ.8 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వీటిని వెంటనే ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పటికీ వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి, అవసరమైన నిధులు సర్దుబాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు. అవసరమైతే ప్రజా ప్రతినిధులకు ఇచ్చే జీతాల్లో 50% కోతపెట్టి రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే సర్దుబాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. వంద రోజుల్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు ఏర్పాట్లకు నిర్ణయించినట్టు చెప్పారు.
రాష్ట్రంలో పదవీకాలం పూర్తయిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల (ప్యాక్స్)కు నామినేటెడ్ పద్ధతిన పాలకవర్గాలను నియమించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గచ్చిబౌలి స్టేడియాన్ని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం 76 ఎకరాలు అందుబాటులో ఉండగా, ఇందులో 64 ఎకరాల్లో 21 రకాల స్పోర్ట్స్‌కు సంబంధించిన సౌకర్యాలు కల్పించడంతోపాటు అవుట్డోర్ స్టేడియం సామర్థ్యం 20 వేల నుంచి 50 వేలకు పెంచాలని నిర్ణయించింది. మిగిలిన 12 ఎకరాలను ప్రైవేట్ డెవలపర్స్‌కు ఇవ్వడం ద్వారా కమర్షియల్ యాక్టివిటీస్‌కు అనుమతివ్వాలని నిర్ణయించింది. చిన్నకాళేశ్వరం ప్రాజెక్టుకు భూసేకరణ పనులను పూర్తి చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. మహదేవ్పూర్, కాటారం, మల్హర్, మహాముత్తారం మండలాల్లో దాదాపు 45 వేల ఎకరాలకు, 63 గ్రామాల ప్రజలకు ఈ ప్రాజెక్టుతో ప్రయోజనం చేకూరుతుంది. భూసేకరణ కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు 2,427 ఎకరాల భూమి అవసరం. ఇప్పటివరకు 1,020 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూసేకరణకు అవసరమయ్యే రూ.166.67 కోట్ల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజె క్టు పరిసరాల్లో మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.