TVK Chief Vijay : కరూర్ తొక్కిసలాట (Karur stampede) కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడిగా ఉన్న తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ (Vijay) కి సీబీఐ సమన్లు జారీచేసింది. ఈ నెల 12న తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులలో ఆదేశించింది. దేశ రాజధాని ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్‌లో విజయ్‌ని విచారించనున్నట్లు తెలిపింది.
కాగా గత ఏడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్ పట్టణంలో విజయ్ ప్రచార ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 110 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటనకు కారణం ఏమిటి..? బాధ్యులు ఎవరు అనే విషయాన్ని సీబీఐ నిర్ధారించాలని తన ఆదేశాల్లో పేర్కొన్నది.
అదేవిధంగా సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని కూడా నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో ఈ కమిటీని వేసింది. ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరిగేలా చూడాలని టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతోపాటు, ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది.