Shambala Movie | డిసెంబర్ 25న విడుదలైన పలు సినిమాల మధ్య పెద్దగా హడావిడి లేకుండా వచ్చి అనూహ్యంగా మంచి ఫలితాన్ని అందుకున్న చిత్రం శంబాల. భారీ బ్లాక్‌బస్టర్ టాక్ కాకపోయినా, “ఒక్కసారి థియేటర్లో చూసేయొచ్చు” అనే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్‌తో ఈ సినిమా నిలకడగా ప్రేక్షకులను ఆకర్షించింది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది సాయికుమార్‌కి ‘శంబాల’ ఒక కీలక మలుపుగా మారింది. సినిమా రిలీజ్‌కు ముందే టీజర్, ట్రైలర్లు ఆసక్తిని పెంచాయి. హారర్–అడ్వెంచర్ జానర్లో కొత్త ప్రయత్నంగా కనిపించిన కంటెంట్‌కి థియేటర్లలో ఆదరణ లభించింది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా కూడా సినిమా ఆశించిన దానికంటే మెరుగ్గా రాణిస్తోంది.
మేకర్స్ విడుదల చేసిన సమాచారం ప్రకారం ‘శంబాల’ ఇప్పటివరకు రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. షేర్ పరంగా చూస్తే దాదాపు రూ.11 కోట్ల వరకు వచ్చింది. మొత్తం బిజినెస్ సుమారు రూ.5 కోట్లుగా ఉండటంతో, సినిమా ఇప్పటికే మంచి లాభాల దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుత రన్ చూస్తే ఫైనల్‌గా రూ.25 కోట్ల గ్రాస్ దాటే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదనంగా హిందీ వెర్షన్ రిలీజ్ కూడా ప్లాన్‌లో ఉండటంతో రెవెన్యూ మరింత పెరగనుంది.యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ అడ్వెంచర్ చిత్రం శంబాల అనే పురాతన గ్రామం చుట్టూ తిరుగుతుంది. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఆ గ్రామంలో 1980లలో ఓ ఉల్క పడిన తర్వాత వింత ఘటనలు మొదలవుతాయి. గ్రామస్తులు దానిని ‘బండ భూతం’గా భావిస్తారు. పాలకు బదులుగా రక్తం రావడం, వరుస హత్యలు, అనూహ్య మరణాలు గ్రామాన్ని భయాందోళనలకు గురిచేస్తాయి.
ఈ పరిస్థితులను పరిశీలించేందుకు ప్రభుత్వం పంపిన సైంటిస్ట్ విక్రమ్ (ఆది సాయి కుమార్) ఆ గ్రామంలో అడుగుపెడతాడు. అక్కడి దేవత కథ, గ్రామ చరిత్ర, వరుస ఘటనల వెనుక ఉన్న రహస్యాలు క్రమంగా బయటపడతాయి. సస్పెన్స్‌తో పాటు హారర్ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేయడం సినిమా ప్రధాన ఆకర్షణగా నిలిచింది.కొత్తదనం ఉన్న కథనాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ‘శంబాల’ ఒక ఉదాహరణగా నిలిచింది. ఆది సాయికుమార్‌కి ఇది కేవలం హిట్ మాత్రమే కాకుండా, కెరీర్లో మళ్లీ బలమైన స్థానం తీసుకొచ్చిన సినిమా అని చెప్పొచ్చు. చిన్న సినిమాగా వచ్చి, సైలెంట్‌గా విజయం సాధించిన ‘శంబాల’ ఇప్పుడు ట్రేడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.