ముంబై: సీబీఐ చీఫ్ సుబోధ్ కుమార్ జైస్వాల్‌కు ముంబై సైబర్ సెల్ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్, పోలీస్ అధికారుల ప్రొమోషన్, బదిలీలకు సంబంధించిన డేటా లీక్ కేసుకు సంబంధించి గురువారం తమ ఎదుట హాజరుకావాల్సిందిగా కోరుతూ ఈ-మెయిల్ ద్వారా సమన్లు పంపారు. మహారాష్ట్రలో రాజకీయ వివాదానికి దారి తీసిన ఈ కేసుపై బాంబే హైకోర్టులో విచారణ జరుగుతున్నది.
మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్‌గా ఉన్న ఐపీఎస్ అధికారిణి రష్మి శుక్లా, పోలీస్ బదిలీలలో జరిగిన అవినీతి గురించి నివేదిక తయారు చేశారు. నాడు డీజీపీగా ఉన్న సుబోధ్ కుమార్ జైస్వాల్ ఈ నివేదికను లీక్ చేసినట్లు ఆరోపణలొచ్చాయి. అలాగే సీనియర్ రాజకీయ నాయకులు, అధికారుల ఫోన్లను ఆయన అక్రమంగా ట్యాప్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.
దీంతో ఈ ఆరోపణలపై ముంబై సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇందులో ఏ పోలీస్ అధికారి పేరును పేర్కొనలేదు. కాగా, మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 1985 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్ ఈ ఏడాది మే నెలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చీఫ్‌గా నియమితులయ్యారు. ఆయన రెండేండ్లపాటు ఈ పదవిలో ఉంటారు.