ఊట్కూర్ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ( Short Circuit ) భారీ అగ్ని ప్రమాదం సంభవించి పశువుల పాక దగ్ధమైంది. ప్రమాదంలో కాడెద్దులు ( Bulls ) , నాటు కోళ్లు ( Chickens ) మృతి చెందాయి. గురువారం అర్ధరాత్రి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దపొర్ల గ్రామంలో చోటుచేసుకున్న వివరాలను స్థానికులు వివరించారు.
గ్రామానికి చెందిన రైతు చాపలి లక్ష్మప్ప గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసుకున్న పశువుల పాకలో కాడెద్దులను బంధించి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి వేళ విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగి షెడ్డుకు నిప్పంటుకుంది. పక్కనే ఉన్న గడ్డి వాముకు మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం భారీగా సంభవించింది. పశువుల పాకలో రెండు ఎద్దులు, వందకు పైగా నాటు కోళ్లు, ఎరువుల బస్తాలు, క్రిమిసంహారక మందులతో పాటు ద్విచక్ర వాహనం కాలి బూడిదైపోయాయి.
శుక్రవారం తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లిన రైతు విషయం తెలుసుకుని బోరున విలపించాడు. ప్రమాదంలో దాదాపు రూ. 15 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు కుటుంబం తెలిపింది. బాధిత కుటుంబాన్ని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా మాస్ లైన్ పార్టీ నాయకుడు కిరణ్ పరామర్శించారు. ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో వెటర్నరీ అధికారులు, ఎలక్ట్రిసిటీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు.