– ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 09 : స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి సీఎం కే.చంద్రశేఖర రావుపై షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య చేసిన మరణ బెదిరింపులపై కేసు నమోదు చేయాలని ఖమ్మం రూరల్ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం షాద్నగర్ ఎమ్మెల్యే కేసీఆర్ చావును తాము కోరుకుంటున్నామని బహిరంగంగా వ్యాఖ్యానించిన తీరును దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆధ్వర్యంలో రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాయుడును కలిసిన నాయకులు తమ ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శంకరయ్య వ్యాఖ్యలు బి.ఎన్.ఎస్ 2023 కింద నేరపూరిత బాధ్యతకు దారితీస్తాయన్నారు. ఈ వ్యాఖ్యలు సెక్షన్ 351 కింద పరిగణించబడతాయని వారు పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పదేపదే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగిందని, తద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతల అత్యవసర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను పరిగణలోకి తీసుకుని తక్షణం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బి.ఎన్.ఎస్ 2023కి లోబడి సదరు ఎమ్మెల్యే పై సెక్షన్ 196, 351 (3), 352, 353, 61 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బానోత్ కృష్ణ, ఏరా వెంకటేశ్వర్లు, లక్ష్మణ్ నాయక్, వెంపటి ఉపేందర్, రెడ్యా నాయక్, మట్ట వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, ముత్యం కృష్ణారావు, వెంకటేష్ పాల్గొన్నారు.