Ramayana | ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రాల్లో ‘రామాయణ: పార్ట్ 1’ ఒకటి. భారతీయ పురాణ ఇతిహాసం రామాయణాన్ని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, యష్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా విజువల్ గ్రాండియర్‌గా తెరకెక్కుతోంది. నవంబర్ 6, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.అదే తేదీన జపాన్‌కు చెందిన మరో భారీ చిత్రం ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ కూడా అంతర్జాతీయ మార్కెట్లలోకి రాబోతోంది. ‘గాడ్జిల్లా మైనస్ వన్’కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తకాషి యమజాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దీంతో రామాయణ–గాడ్జిల్లా మధ్య పోటీ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదలైతే థియేటర్లు, ఆడియెన్స్, బాక్సాఫీస్ వసూళ్ల కోసం పోటీ ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. కారణం.. రెండు సినిమాలూ ప్రీమియం ఐమ్యాక్స్ అనుభూతిని దృష్టిలో పెట్టుకుని రూపొందిన భారీ విజువల్ చిత్రాలు కావడమే. ముఖ్యంగా ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ను జపాన్‌లో ఐమాక్స్ కోసం ప్రత్యేకంగా చిత్రీకరించిన తొలి జపనీస్ ప్రొడక్షన్‌గా అధికారికంగా ప్రచారం చేస్తున్నారు. ఐమాక్స్ స్క్రీన్లపై విజువల్స్, సౌండ్‌ను మరింత విస్తృతంగా ఆస్వాదించేలా సినిమాను రూపొందించినట్లు చిత్రబృందం చెబుతోంది.ఇక ‘రామాయణ’ కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ముఖ్యంగా నార్త్ అమెరికా వంటి ఓవర్సీస్ మార్కెట్లలో ఐమాక్స్ స్క్రీన్ల కేటాయింపు కీలకంగా మారే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.
‘గాడ్జిల్లా మైనస్ జీరో’ తాజా ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ పోటీపై చర్చ మరింత పెరిగింది. ట్రైలర్లో భారీ విజువల్స్, గాడ్జిల్లా విధ్వంసం, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపించడంతో సినిమాపై అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ‘గాడ్జిల్లా మైనస్ వన్’ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ అందుకోవడంతో దాని సీక్వెల్‌పై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు తకాషి యమజాకి ఈసారి కూడా గాడ్జిల్లాను కేవలం భారీ మాన్స్టర్గా కాకుండా భయం, విధ్వంసం, మానవ భావోద్వేగాలతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా ట్రైలర్ తర్వాత ‘గాడ్జిల్లా మైనస్ జీరో’కు ఓవర్సీస్ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు సినిమాల మధ్య పోటీలో అత్యంత కీలకమైన అంశం ఐమాక్స్ స్క్రీన్లు కావొచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధారణ స్క్రీన్లలో రెండు సినిమాలకూ థియేటర్లు దొరికే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రీమియం ఫార్మాట్ల విషయంలో మాత్రం స్క్రీన్ కేటాయింపులు కీలకం కానున్నాయి.