
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నుంచి ప్రకటన చేయించడం చేతగాని బీజేపీ నేతలు రైతు బతుకుపై రౌడీయిజం చేస్తున్నారు. ‘ఇన్నాళ్లకు మాకు నీళ్లొచ్చినయ్. పంటలు మంచిగ పండుతున్నయ్. ఇప్పడిప్పుడే మా బతుకులు గాడిన పడుతుంటే.. వడ్లు కొనేది లేదంటే ఏంజెయ్యాలె?’ అని ప్రశ్నించిన రైతులకు సమాధానం చెప్పలేక దాడులకు తెగపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఆధ్వర్యంలో సాగుతున్న యాత్ర రెండో రోజూ రాక్షస క్రీడను తలపించింది. వందల వాహనాలు, పరాయి నేతలు, కిరాయి గూండాలు రాళ్లు,
వెదురు కర్రలతో కొనుగోలు కేంద్రాలపై పడ్డారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్, ఆత్మకూర్.ఎస్‌లో రైతులు, పోలీసులు, టీఆర్ఎస్ నాయకులను గాయపర్చారు. అంతకుముందు రోజు కమల మూకలు నల్లగొండ జిల్లాలో ధాన్యం కుప్పలను నాశనం చేయడం చూసిన రైతాంగం.. పంటను కాపాడుకునేందుకు ధైర్యంగా ఎదురొడ్డింది. మహిళా రైతులు
రాసులకు రక్షణగా నిలబడి నినాదాలు చేశారు. ఏ ఒక్క కొనుగోలు కేంద్రంలోకి
కూడా సంజయ్‌ను అడుగుపెట్టనివ్వలేదు. గంటల తరబడి నిరీక్షించిన బండి..
రైతుల నిరసనలతో రూటు మార్చి, షెడ్యూల్లోని కేంద్రాలను దాటుకుని వెళ్లిపోయాడు. బీజేపీ దౌర్జన్యకాండను ఖండిస్తూ రైతులతో కలిసి
టీఆర్ఎస్ నాయకులు నిరసనలు తెలిపారు.