బండి సంజయ్.. గడిచిన మూడేళ్లలో కరీంనగర్ ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనైనా చేసినవా?. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో.. వెయ్యి పనులు చెబుతా..? ఏ వర్గానికి ఏం చేశావు? యువత కోసం కాలేజీ తెచ్చావా? రైతుల కోసం కాళేశ్వరానికి జాతీయ హోదా తెచ్చావా? నేత కార్మికులకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తెచ్చావా? చేనేత సమూహాలు తెచ్చావా.? నేదునూర్‌లో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం తెచ్చావా.? ‘ఇవేమీ తేకపోగా, తెల్లారి లేస్తే డబ్బాలో రాళ్లేసి ఊపినట్లుగా హిందూ, ముస్లిం అంటూ ఒకటే లొల్లి.. పోనీ ఆ లెక్క చూసినా కనీసం ఒక్క గుడి అయినా తీసుకొచ్చావా.? చివరికి వేంకటేశ్వరస్వామి గుడి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పదెకరాలు తీసుకువచ్చిన ఘనత మంత్రి గంగుల కమలాకర్‌ది. మరీ నీకేం చేతనవుతది. గంగుల చేతిలో ఓడి అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్లుగా ఏదో గాడ్పు వల్ల ఎంపీగా గెలిచి, తంతే గారెల బుట్టలో పడ్డట్టు రాష్ట్ర అధ్యక్ష హోదాలో ఉన్నవు. దీనికే ఇగ ఆగుడే లేదు..
– మంత్రి కేటీఆర్ సవాల్
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన గురువారం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది, మంత్రి గంగుల నేతృత్వంలో ఘన స్వాగతం మధ్య ప్రారంభమైన పర్యటన.. చివరి వరకూ అంతే అట్టహాసంగా సాగింది. ఈ సందర్భంగా కరీంనగర్, చొప్పదండిలో రూ.1100 కోట్ల పైచిలుకు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్.. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు చెబుతూనే.. మరోవైపు బీజేపీతో పాటు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ ఎంపీలు అనుసరిస్తున్న తీరుపై మూడు ప్రాంతాల్లో జరిగిన సభల్లో నిప్పులు చెరిగారు. “బండి సంజయ్ బాగా మాట్లాడుతున్నావు కదా.. నీకు దమ్ముంటే గంగుల కమలాకర్‌పై పోటీచేసి గెలిచి చూపించు” అంటూ కరీంనగర్ బహిరంగ సభా వేదికగా సవాల్ విసిరిన మంత్రి.. వచ్చే ఎన్నికల్లో గంగులను లక్ష మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో.. బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దని హితవు చెబుతూనే.. భర్తీ కానున్న 80 వేల పోస్టులకు యువతీయువకులు ప్రిపేర్ కావాలని పిలుపునిచ్చారు. స్థలం ఉండి ఇంటిని నిర్మించుకుంటే 3లక్షలు ఇస్తామని, కరీంనగర్‌కు అదనంగా మరో మూడు వేల ఇండ్లు మంజూరు చేయిస్తామని చెబుతూనే.. చొప్పదండి ఎమ్మెల్యే కోరిక మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిస్తే గంగాధరను మున్సిపాలిటీగా చేస్తామని హామీ ఇచ్చారు.
కార్పొరేషన్, మార్చి 17: భావితరాల భవిష్యత్తు మంచిగా ఉంచేందుకు సీఎం కేసీఆర్‌కు ప్రజలంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ తెలంగాణకు దైవమైతే.. ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ అని అభివర్ణించారు. అనునిత్యం తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ పుట్టిన గడ్డ మీద తాను పుట్టడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. మంత్రి కేటీఆర్‌కు కరీంనగర్‌తో విడదీయలేని అనుబంధం ఉందని, ఆయన పుట్టింది, చదివింది ఇక్కడేనని గుర్తు చేశారు. ఏడాదిలోనే వెయ్యి కోట్లు ఇచ్చి అభివృద్ధి చేయించిన ఘనత సీఎం కేసీఆర్, కేటీఆర్‌దేనని ఉద్ఘాటించారు. కరీంనగర్లో వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరిన వెంటనే పదెకరాల భూమి ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నా కూడా ఇక్కడి పిల్లలు వేరే రాష్ర్టాలకు, దేశాలకు పోవద్దనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేశారని తెలిపారు. ఐటీ టవర్ కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్, అద్భుతమైన రోడ్లతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇలాంటి అభివృద్ధిని ఇంతకు ముందు ఎప్పుడైనా చూశామా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు 70 ఏండ్లలో ఒక్క రూపాయైనా గత పాలకులు నిధులు ఇచ్చారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ గొప్ప మనస్సుతో గొప్పగా ఆలోచించి ఏడేండ్లలో 2 వేల కోట్లతో నగర రూపురేఖలు మార్చారని తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్‌ను ఏడాదిన్నరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, దీంతోపాటుగా నగరంలో రూ.615 కోట్లతో మరింత అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. 2009లో ఎమ్మెల్యేగా గత ప్రభుత్వాల ముందు దరఖాస్తు ఇచ్చి కోటి రూపాయలు ఇయ్యమని దండం పెట్టినా అప్ప టి సీఎంలు వెకిలిగా నవ్వి ఇవ్వలేదని గుర్తు చేశారు. కానీ స్వరాష్ట్రలో రాష్ట్రంలో దైవసమానుడు కేసీఆర్‌కు విన్నవిస్తే ఒక్క క్షణంలోనే రూ.110 కోట్లు ఇచ్చి నగరంలోని రోడ్లను అభివృద్ధ్ది చేయించారని పేర్కొన్నారు. గతంలో మానేరు పక్కనే ఉన్న మంచినీటికి కోసం తిప్ప లు పడాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ప్రతి రోజు మంచినీటిని అందిస్తున్నామని తెలిపారు. ప్ర పంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ర్టానికి అనేక కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయని తెలిపారు. కేటీఆర్ మంత్రిగా అనేక ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు తరలివస్తున్నాయన్నారు. నగరాన్ని గొప్పనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఒక ఏడాదిలోనే మట్టి దారులు కనిపించకుండా చేస్తామని చెప్పారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ సునీల్‌రావు
కార్పొరేషన్, మార్చి 17: నగరంలో ప్రస్తుతం ప్రారంభిస్తున్న అన్ని అభివృద్ధి పనులను కూడా వచ్చే ఆరు నెలల్లోనే పూర్తి చేసే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామని కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ అందిస్తున్న ప్రోత్సాహంతో నగరాన్ని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే పట్టణ ప్రగతి నిధులతో పార్కులు, వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. వీటితోపాటు నగరంలో పచ్చదనం నింపే విధంగా హరితహరంలో మొక్కలు నాటడంతో పాటుగా, నర్సరీల పెంపు, వైకుంఠధామాల నిర్మాణాలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే నగరంలోని అన్ని డివిజన్లలో ప్రతి రోజూ మంచినీటి సదుపాయం కల్పించామని, అతి త్వరలోనే 24 గంటల మంచినీటి సరఫరా అందిస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నగరంలో రూ.615 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులన్నింటినీ వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఏడాదిలోనే వెయ్యి కోట్లు ఇచ్చి నగరాన్ని అభివృద్ధి చేయించిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ది. భావితరాల భవిష్యత్ మంచిగా ఉంచేందుకు సీఎం కేసీఆర్‌కు ప్రజలంతా అండగా నిలవాల్సిన అవసరమున్నది. కరీంనగర్‌పై ఉన్న ప్రేమతో నగరాభివృద్ధి కోసం ఏ రోజు ఎన్ని నిధులు అడిగినా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కాదనకుండా వెంటనే మంజూరు చేస్తున్నారు. అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మానేరు రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఐటీ టవర్ కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్, అద్భుతమైన రోడ్లతో గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం.
– మంత్రి గంగుల కమలాకర్