కార్లోస్ అల్కరాజ్ గార్ఫియా.. అలియాస్ అల్కరాజ్! 2003 మే 5న స్పెయిన్‌లోని ఎల్పాల్మర్లో కార్లోస్ అల్కరాజ్ గొంజాలెజ్, వర్జినియా గార్ఫియా ఎస్కాండెన్కు అల్కరాజ్ జన్మించాడు. పువ్వు పుట్టగానే పరిమళించిందన్నట్లు ఊహ తెలియని వయసులోనే అల్కరాజ్ రాకెట్ చేతపట్టాడు. తండ్రి టెన్నిస్ కోచ్ కావడంతో అల్కరాజ్కు ఉగ్గుపాలతోనే టెన్నిస్ పాఠాలు నేర్చుకున్నట్లు అయ్యింది. టెన్నిస్ దిగ్గజ త్రయమైన రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, నొవాక్ జొకోవిచ్‌ను చూస్తూ పెరిగిన అల్కరాజ్ పిన్న వయసు నుంచే రికార్డులు నెలకొల్పాడు. 2018లో 15 ఏండ్ల వయసు ఉన్నప్పుడే ప్రొఫెషనల్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ స్పెయిన్ నయాబుల్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. స్పెయిన్‌కే చెందిన దిగ్గజ రఫెల్ నాదల్‌ను ఆరాధ్య ఆటగానిగా భావించే అల్కరాజ్ అతని అడుగుజాడల్లో నడుస్తున్నాడు.
2021లో తొలుత టాప్-100 ర్యాంకింగ్స్‌లోకి అడుగుపెట్టిన కార్లోస్..యూఎస్ ఓపెన్ కార్వర్ట్స్ చేరి టాప్-35లోకి దూసుకొచ్చాడు. 18 ఏండ్ల వయసులో 2022లో మియామి ఓపెన్ టైటిల్ గెలిచిన అల్కరాజ్ అదే ఏడాది యూఎస్ ఓపెన్ టైటిల్‌తో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఒపెన్ఎరాలో అతిపిన్న వయసు (19 ఏండ్ల 4నెలల 6రోజులు)లో ప్లేయర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతటితో ఆగకుండా నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుని తన ఆగమనాన్ని ఘనంగా చాటిచెప్పాడు. 2023లో ఏడుసార్లు చాంపియన్ జొకోవిచ్‌ను వింబుల్డన్‌లో మట్టికరిపిస్తూ చారిత్రక ఫైనల్లో టైటిల్ విజేతగా నిలిచాడు. అదే దూకుడు కొనసాగిస్తూ గతేడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి ట్రోఫీని ముద్దాడాడు. నాదల్‌ను స్ఫూర్తిగా తీసుకుంటూ మట్టికోర్టులో తనకు తిరుగులేదన్నట్లు ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేశాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఇచ్చిన కిక్కును వింబుల్డన్‌లో కొనసాగిస్తూ రెండోసారి విజేతగా నిలిచాడు.
తాజాగా ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ ఇదే ఒరవడి కొనసాగించి డిఫెండింగ్ చాంపియన్‌గా తన టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఐదున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన తుదిపోరులో ప్రపంచ నంబర్‌వన్, ఇటలీకి చెందిన సిన్నర్‌ను ఓడిస్తూ మట్టికోర్టు యువరాజుగా మన్ననలు అందుకుంటున్నాడు. కెరీర్లో తొలిసారి రెండు సెట్లు కోల్పోయి వరుసగా మూడు సెట్లలో అసమాన పోరాటపటిమ కనబరిచి ఫ్రెంచ్ ఓపెన్‌పై తనదైన ముద్ర వేశాడు. మట్టికోర్టులో కొదమసింహన్ని తలపిస్తూ సిన్నర్‌కు దీటైన పోటీనిచ్చాడు. మ్యాచ్ సిన్నర్‌కు చేజారుతుందనుకున్న ప్రతీసారి తనలో పోరాటయోధున్ని పరిచయం చేస్తూ రెండోసారి ఫ్రెంచ్ కింగ్‌గా నిలిచాడు.ఈ క్రమంలో 22 ఏండ్ల వయసులోనే ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన అల్కరాజ్..భవిష్యత్ టెన్నిస్ దిగ్గజంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.