
నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 11: నిజామాబాద్ జిల్లా కేంద్రం మీదుగా మహారాష్ట్ర ప్రాంతానికి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇతర జిల్లాల్లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, మహారాష్ట్ర ప్రాంతంలో రెట్టింపు ధరకు విక్రయించేందుకు స్మగ్లింగ్ చేస్తున్నారు. ముఠా సభ్యు లు ఎవరికీ అనుమానం రాకుండా ప్యాసింజ ర్ ఆటోలో గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కారు. వారి నుంచి గంజాయితోపాటు వాహనాలు, సెల్ ఫోన్లను స్వాధీ నం చేసుకొని సీజ్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.8 లక్షలు ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ అదనపు డీసీపీ(లా ఆండ్ ఆర్డర్) డాక్టర్ వినీత్ పట్టణంలోని ఐదో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిజామాబాద్ ఏసీపీ, ఏ. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ గురునాథ్ ఆధ్వర్యంలో ఐదో టౌన్ ఎస్సై 2 శ్యామ్ సుందర్, సిబ్బందితో కలిసి నగరంలోని బాబాన్ సహాబ్ పహాడ్ ఏరియాలో వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో భాగంగా గంజాయిని తరలిస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. గంజాయిని భూపాలపల్లి జిల్లా నుంచి నిజామాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు అదనపు డీసీపీ వెల్లడించారు. నిందితుల నుంచి సుమారు రూ.8 లక్షల విలువైన 44 కేజీల గంజాయితోపాటు రెండు ఆటో రిక్షాలు, ఆరు సెల్ఫోన్లు, ఒక పల్సర్ బైక్‌ను సీజ్ చేసినట్లు చెప్పారు. పట్టుబడిన నిందితుల్లో జిల్లా కేంద్రంలోని ముజాహిద్‌నగర్ కాలనీకి చెందిన ఉస్మాన్ ఖాన్, దొడ్డి కొమురయ్య కాలనీకి చెందిన షేక్ మోహిజ్, వెంగళ్ రావ్ నగర్ కు చెందిన షేక్ సిరాజ్, కోటగల్లీకి చెందిన బి. సుధాకర్, జయ శంకర్ భూపాల పల్లి జిల్లా చిట్యాల మండలం జడల పేటకు చెందిన కడారి రాజు ఉన్నారు. ఈ ఐదుగురిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు అదనపు డీసీపీ డాక్టర్ వినీత్ తెలిపారు. వీరితోపాటు బాలుడు సైతం ఉండడంతో జువైనల్ హోంనకు తరలించినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ గురునాథ్ , ఎస్సై 2 శ్యామ్ సుందర్ పాల్గొన్నారు. గంజాయి ముఠాను పట్టుకున్న సిబ్బంది వి.నిలేశ్, వేణు గోపాల్, పి.సురేశ్‌ను సీపీ కార్తికేయ అభినందించారు.