హనుమకొండ చౌరస్తా : కశ్మీర్‌లోని పహల్గాం ( Pahalgam ) ఉగ్రదాడిలో మరణించిన వారికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు హనుమకొండ అంబేద్కర్ సర్కిల్ నుంచి అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ (Candlelight ) నిర్వహిస్తున్నట్లు శివాజీ యువజన భక్తమండలి సభ్యులు తెలిపారు. శనివారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభ్యులు భాస్కర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, అశోక్ రావు, ప్రదీప్ రావు, జానకి రామారావు మాట్లాడారు.
కుటుంబాలతో జమ్మూ ,కశ్మీర్( Kashmir ) అందాలను చూడడానికి వచ్చిన హిందువుల మీద వారి పిల్లల ఎదుట తండ్రులను, భార్య ముందు భర్తను, యువ జంటలో భార్య ముందు భర్తను చంపిన వైనం దేశంలోని 140 కోట్ల ప్రజల మనసు కదిలింపచేసిందన్నారు. ఇలాంటి సమయంలో కూడా మనం చేతులు ముడుచుకొని కూర్చుంటే మంచితనం కూడా చేతగానితనం అయిపోతుందని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి ( Narendra Modi) కుల, మత రాజకీయాలకతీతంగా అండగా నిలబడి కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్‌తో యుద్ధం చేయడానికి, త్రివిధ దళాల సైన్యానికి తామంతా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఉగ్రవాదుల చేతిలో అసువులు బాసిన హిందువులకు నివాళులర్పించి, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని వారు కోరారు.