Siddipet ACP : సిద్ధిపేట మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ లావణ్య(23) ఆత్మహత్య కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతోనే ఆమె పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుందని మొదట అందరూ అనుకున్నారు. కానీ, ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో ఆమె మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుందని పోలీసులు తెలిపారు. లావణ్య మరణానికి కారణమైన ప్రణయ్ తేజ్‌ను అరెస్ట్ చేశామని సిద్ధిపేట ఏసీపీ యం. రవీందర్ రెడ్డి తెలిపారు.
ఏసీపీ ఎం.రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లావణ్య సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. అక్కడ సీనియర్ రెసిడెంట్‌గా జనరల్ మెడిసిన్ చదువుతున్న సికింద్రాబాద్ ఆల్వాల్‌కు చెందిన ప్రణయ్ తేజ్‌తో లావణ్య ప్రేమలో ఉంది. నిరుడు జూలై నెలలో వీళ్ల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వివాహం చేసుకుంటానని నమ్మించి ప్రణయ్ తేజ్ ఆమెతో సన్నిహితంగా మెలిగేవాడు. అయితే.. ఇద్దరి కులాలు వేరు కాబట్టి పెళ్లికి అతడు నిరాకరించాడు. దాంతో, లావణ్య తీవ్ర మనస్తాపానికి గురైంది. మనోవేదనకు లోనైన ఆమె జనవరి 3వ తేదీన హోస్టల్ రూమ్‌లో గడ్డి నివారణకు ఉపయోగించే ‘పారాక్విట్'(Paraquat)ను సెలైన్ ఎక్కించే సూది ద్వారా ఇంజక్షన్ చేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న లావణ్యను రూమ్మేట్స్ గుర్తించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుండి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ జనవరి 4న తెల్లవారుజామున 01.00 గంటలకు లావణ్య కన్నుమూసింది.
తన చెల్లెలు ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానం వ్యక్తం చేసిన అక్క శిరీష సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టి నిందితుడు ప్రణయ్ తేజ్ ఆచూకీ తెలుసున్నారు. త్రీ టౌన్ ఇన్స్పెక్టర్, ఎస్.ఐ వెంకటేశ్వర్లు ఏర్పాటు చేసిన టీమ్ ప్రణయ్ తేజ్‌ను పట్టుకుంది. అనంతరం విచారణలో అతడిది తమది బీసీ (కంసాలి) కులమని గుర్తించారు. మృతురాలు లావణ్య దళిత సామాజిక వర్గానికి చెందినందున అతడిపై సెక్షన్ 108, 69 బి.ఎన్.ఎస్, SC/ST చట్టం ప్రకారం ప్రణయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కోసం కోర్టులో హాజరు పరిచామని ఏసీపీ రవీందర్ రెడ్డి వెల్లడించారు.
సిద్దిపేట మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య కేసులో కీలక మలుపు
యువతి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చిన పోలీసులు
లావణ్య ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ ప్రణయ్‌ని అరెస్ట్ చేసిన సిద్దిపేట పోలీసులు
ఏడాది నుంచి ప్రేమించుకుంటున్న లావణ్య, ప్రణయ్ తేజ్
పెళ్లికి కులం వేరే… https://t.co/495NpjZATC pic.twitter.com/stbE5EYmrZ
— Telugu Scribe (@TeluguScribe) January 5, 2026
జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన బి. లావణ్య (23) సాంఘిక సంక్షేమ పాఠశాలలో పదో తరగతి చదివింది. తదుపరి హైదరాబాద్ గచ్చిబౌలిలోని గౌలిదొడ్డి క్యాంపస్‌లో ఇంటర్ పూర్తి చేసింది. అనంతరం 2020లో మొదట ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సీటు సాధించి సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేరింది. చదువులో, ఆటల్లో చురుకుగా ఉండేది. ఆమె తల్లిదండ్రులు కూలీ పని చేస్తూ జీవిస్తున్నారు. అక్క శిరీష హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది.