తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నది. అందులోభాగంగా క్యాన్సర్‌కు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే క్యాన్సర్ పరీక్షలు చేసేందుకు ముందుకొచ్చింది. నోటి, రొమ్ము, గర్భసంచి క్యాన్సర్లకు చికిత్స అందించనున్నది. సబ్ సెంటర్ల పరిధిలో అనుమానితులను గుర్తించి వారికి పీహెచ్సీ స్థాయిలో స్క్రీనింగ్ చేయనున్నది. త్వరలో జిల్లా ఆసుపత్రులకు కీమో, రేడియోథెరపీ చేసేందుకు పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులకు శిక్షణ పూర్తి చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ ఉందని వైద్యులు చెప్పగానే గుండె అదిరిపోయేలా భయపడతారు రోగులు. ఆ భయంతోనే రోగం మరింత పెరిగే ప్రమాదముంటుంది. అలాంటి పెద్ద రోగానికి సైతం స్థానికంగా ఉన్న చిన్నాసుపత్రుల్లోనే స్క్రీనింగ్ చేసేలా ముందస్తు చర్యలు చేప డుతోంది తెలంగాణ సర్కారు. భయకరంమైన పెద్ద జబ్బును సైతం ముందస్తుగా గుర్తించి మందులు వాడితే తగ్గిపోయే అవకాశం ఉంటున్నదని చెబుతోంది ప్రభుత్వం. ఇందుకోసం గ్రామస్థాయిలోనే పరీక్షలు చేయించి మందులు పంపిణీ చేసే కార్య క్రమాన్ని చేపడుతోంది. ఇప్పటికే బీపీ, షుగర్ జబ్బులకు స్థానికంగానే మందులు ఇస్తున్న ప్రభుత్వం.. మున్ముందు క్యాన్సర్‌ను సైతం ప్రాథమిక స్థాయిలో గుర్తించి అదుపు చేసేలా ముందడుగు వేస్తోంది. ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లకు, స్టాఫ్ నర్సులకు జిల్లా కేంద్రాల్లో శిక్షణ పూర్తి చేశారు. మరో పదిహేను రోజుల్లో స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారం భించబోతున్నారు. ఇప్పటికే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు.. పీహెచ్సీ స్థాయిలో క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తామని ప్రకటించిన విషయం విదితమే. ఇందుకోసం ప్రతి ఆరోగ్య కేంద్రానికీ ఒక ఎన్సీడీ సూపర్వైజర్ను కేటాయించారు. త్వరలో జిల్లా ఆసుపత్రిలోనూ ప్రత్యేక ఎన్సీడీ క్లినిక్‌లను ఏర్పాటు చేయనున్నారు.
ముందస్తు చర్యలతో క్యాన్సర్ కట్టడి..
దీర్ఘకాలికంగా బాధపెట్టే క్యాన్సర్ వ్యాధికి ముందస్తు చర్యలతో చెక్ పెట్టేందుకు వైద్యారోగ్యశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ముఖ్యంగా మూడు క్యాన్సర్లను గుర్తించి వాటికి స్క్రీనింగ్ చేయనున్నది. నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్లకు వైద్య చికిత్స అందించనున్నారు. సబ్ సెంటర్ల పరిధిలో అనుమానితులను గుర్తించి వారికి పీహెచ్సీ స్థాయిలో పరీక్షలు చేయనున్నారు. స్క్రీనింగ్‌లో అనుమానం ఉంటే వారికి ప్రధాన ఆసుపత్రిలో ప్రత్యేక పరికరాలతో పరీక్షలు చేస్తారు. అవసరమైతే హైదరాబాద్‌కు రిఫర్ చేసి నిపుణుల పర్యవేక్షణలో ఉచిత వైద్యం అందిస్తారు. దీని వల్ల వ్యాధిని ముందస్తుగా గుర్తించే వీలు కలుగుతుంది. దీంతో క్యాన్సర్ మొదటి దశలో ఉన్న వారు ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలున్నాయి. అవగాహన లేమి కారణంగా చాలామంది రోగులు రెండో దశను దాటి మూడో దశకు వెళ్తున్నారు. ఆ చివరి దశలో ఆసుపత్రికి వెళ్లినా.. అప్పటికే వ్యాధి తీవ్రత పెరిగి మృత్యువుకు దగ్గరవుతున్నారు. కాగా, భద్రాద్రి జిల్లాలో ఇప్పటికే 269 మంది కాన్సర్ రోగులు మందులు వాడుతున్నారు. వారిలో 20 మంది చనిపోయారు.
అసాంక్రమిత వ్యాధులపై సర్వే..
అంటువ్యాధులు కాని వాటినే అసాంక్రమిత వ్యాధులు (ఎన్సీడీ)అంటారు. అలాంటి వ్యాధులు ఉన్న వారి కోసం 2019లోనే సర్వే చేశారు. బీపీ రోగులు 46 వేలమంది, డయాబెటిస్ రోగులు 26 వేల మంది కలిపి మొత్తం 72 వేల మంది ఉన్నట్లు గుర్తించారు. వారికి మం దులు పంపిణీ చేస్తున్నారు. ఇదే తరహాల్లో క్యాన్సర్ రోగులనూ గుర్తించనున్నారు. క్యాన్సర్ పరీక్షలపై అవగాహన, శిక్షణ కోసం జిల్లా ఆసుపత్రిలో ఎన్సీడీ సూపర్వైజర్లను ముంబయికి పంపించనున్నారు. కాగా, 30 ఏళ్ల వయసు దాటిని వారికి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. వారిలో ఎవరికైనా క్యాన్సర్ అనుమానితులు ఉంటే వీరిని పరీక్షిస్తారు. వారిలో క్యాన్సర్ ఏ దశలో ఉందో నిర్ధారిస్తారు.
పీహెచ్‌సీల్లోనే క్యాన్సర్ స్క్రీనింగ్..
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో క్యాన్సర్ పరీక్షలు చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. మరో 15 రోజుల్లో అన్ని పీహెచ్‌సీల్లో క్యాన్సర్ అనుమానితులకు స్క్రీనింగ్ చేయబోతున్నారు. త్వరలో జిల్లా ఆసుప్రత్రులకు కీమో, రేడియోథెరపీ చేసేందుకు పరికరాలు రానున్నాయి. ప్రస్తుతం పరీక్షలు చేసిన వారికి హైదరాబాద్ ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్సలు చేయించనున్నారు. ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో వైద్యం అందించినా వారికి మందులను మాత్రం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇవ్వనున్నారు.
పదిహేను రోజుల్లో స్క్రీనింగ్ పరీక్షలు..
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. మరో పదిహేను రోజుల్లో స్క్రీనింగ్ పరీక్షలు మొదలుపెడతాం. ఇప్పటికే వైద్యులకు, స్టాఫ్‌నర్సులకు శిక్షణ ఇచ్చాం. డాక్టర్ ప్రసాద్ ఎన్సీడీ జిల్లా ప్రోగాం అధికారిగా ఉన్నారు. భద్రాచలం, కొత్తగూడెం ఆసుపత్రుల్లో ఎన్సీడీ క్లినిక్‌లను అందుబాటులో ఉంచుతాం. మందులను అక్కడే ఇస్తాం.
-డాక్టర్ శిరీష, డీఎంహెచ్‌వో, కొత్తగూడెం