కాశీబుగ్గ, నవంబర్ 23: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో పలు టెండర్లను రద్దు చేసినట్లు చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి తెలిపారు. మంగళవారం మార్కెట్ ప్రధాన కార్యాలయంలో పాలకవర్గ సభ్యుల సమావేశం జరిగింది. పత్తియార్డు క్లీనింగ్‌కు మార్కెట్ కమిటీ నిర్ణయించిన టెండర్ ధర సంవత్సరానికి రూ. 4.50 లక్షలు కాగా, రూ. 6 లక్షలు, రూ. 5.50 లక్షలు వేయడంతో టెండర్ రద్దు చేసినట్లు తెలిపారు. ధాన్యం అపరాల యార్డు క్లీనింగ్ కోసం ఒకే టెండర్ వేయడంతో రద్దు చేసినట్లు చెప్పారు. పండ్ల మార్కెట్లో క్లీనింగ్‌కు మార్కెట్ కమిటీ నిర్ణయించిన ధర సంవత్సరానికి రూ. 9.60 లక్షలు కాగా, కేఅఖిల్ రూ. 9.50 లక్షలకు టెండర్ వేయగా ఖరారు చేసినట్లు తెలిపారు.
అలాగే, మార్కెట్ అంతర్గత రోడ్లు క్లీనింగ్‌కు మార్కెట్ కమిటీ రూ. 5 లక్షలు నిర్ణయించగా, రూ. 6 లక్షలు, రూ. 6.50 లక్షలకు వేయడంతో టెండర్లను రద్దు చేసినట్లు తెలిపారు. కూరగాయల మార్కెట్లో క్లీనింగ్‌కు మార్కెట్ కమిటీ రూ. 14 లక్షలు నిర్ణయించగా, రూ. 19.50 లక్షలు, రూ. 18 లక్షలకు టెండర్లు వేసినందుకు రద్దు చేసినట్లు తెలిపారు. పల్లి, పసుపు యార్డు, చిల్లీస్ యార్డుల క్లీనింగ్‌కు టెండర్లలో ఎవరూ పాల్గొనలేదని వెల్లడించారు. సమావేశంలో కార్యదర్శి బరుపాటి వెంకటేశ్ రాహుల్, గ్రేడ్-2 కార్యదర్శులు తోట చందర్రావు, ఎండీ బియాబానీ, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
క్లీనింగ్ వాహనం పరిశీలన
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పారిశుధ్య పనులు నిర్వహించే క్లీనింగ్ వాహనాన్ని చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, కార్యదర్శి వెంకటేశ్ రాహుల్, పాలకవర్గ సభ్యులు సందర్శించి పరిశీలించారు. క్లీనింగ్ వాహనం పనితీరును సరిచూశారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన క్లీనింగ్ మిషన్‌తో మార్కెట్లోని ప్రధాన రహదారి, మార్కెట్ కార్యాలయం చుట్టూ క్లీనింగ్ చేయించారు. మార్కెట్ కమిటీ తరఫున కొనుగోలు చేసేందుకు పని తీరును పరిశీలించారు.