న్యూఢిల్లీ, జూలై 25: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,022.03 కోట్ల స్టాండ్‌లోన్ నికర లాభాన్ని గడించింది. సమీకృత ఆదాయం పెరగడం, మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో లాభాల్లో భారీగా 72 శాతం వృద్ధి నమోదైందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.
అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.1,177.47 కోట్ల లాభాన్ని గడించిన విషయం తెలిసిందే. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.20,940.28 కోట్ల నుంచి రూ.23,351.96 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. వడ్డీల మీద వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన 8.3 శాతం పెరిగి రూ.18,176.64 కోట్లకు చేరుకోవడం వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవో ఎల్వీ ప్రభాకర్ తెలిపారు.
జూన్ 2021తో ముగిసిన త్రైమాసికంలో 8.50 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తుల విలువ గత త్రైమాసికానికిగాను 6.98 శాతానికి తగ్గినట్లు ఆయన చెప్పారు. విలువ పరంగా చూస్తే స్థూల ఎన్పీఏ లేదా మొండి బకాయిలు రూ.58,215.46 కోట్ల నుంచి రూ.54,733.88 కోట్లకు తగ్గాయి. నికర ఎన్పీఏ కూడా 3.46 శాతం(రూ.22,343 కోట్లు) నుంచి 2.48 శాతానికి(రూ.18,504.83 కోట్లకు) తగ్గాయి.
కానీ, మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ నిధుల కేటాయింపులు మాత్రం రూ.3,458 కోట్ల నుంచి రూ.3,690 కోట్లకు పెరిగాయి. కన్సాలిడేటెడ్ విషయానికి వస్తే బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 88 శాతం ఎగబాకి రూ.2,058.31 కోట్లకు చేరుకోగా, ఆదాయం రూ.23,019 కోట్ల నుంచి రూ.23,739.27 కోట్లకు చేరుకున్నాయి.