హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రముఖ ఆయలం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన (Yadagirigutta) సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆలయ సేవలను కెనడా ప్రధాని మార్క్ కార్నీ (PM Mark Carney) అభినందించారు. తమ దేశంలోని ఒట్టావాలో ఉన్న ఈవై సెంటర్లో లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ మహోత్సవం (Kalyana Mahotsavam) నిర్వహించడాన్ని అభినందిస్తూ దేవస్థాన నిర్వాహకులకు ప్రధాని కార్నీ లేఖ రాశారు. హిందూ సంస్కృతి ఆధ్యాత్మిక, ఐక్యతను ప్రశంసించారు. ఒక పవిత్ర సంప్రదాయాన్ని కొనసాగించడానికి, ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించడంతోపాటు ఐక్యత, సమాజ విలువలను గౌరవించడానికి కల్యాణ మహోత్సవం ఒక మంచి సందర్భమని అభివర్ణించారు. ఒట్టావాలో భక్తులను ఏకతాటిపైకి తీసుకురావడంతో ఆలయ నిర్వాహకులు, సమన్వయకర్తలు చేసిన కృషికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కెనడా సమాజాన్ని సుసంపన్నం చేయడంలో హిందూ సమాజం పాత్రను ప్రశంసించారు.
ప్రధాని మార్క్ కార్నీ లేఖపై మంత్రి కొండా సురేఖ, ఈవో వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు. ఇది తమకు లభించిన గొప్ప గౌరవంగా పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీ వరకు కెనడాలోని 4 రాష్ట్రాల్లో స్వామివారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. స్వామివారి సేవలను భక్తులకు మరింత విస్తృతం చేస్తామన్నారు. భవిష్యత్లోని ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు.