SpinLaunch | ఢిల్లీ, ఫిబ్రవరి 13: అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త విప్లవం. రాకెట్ అవసరం లేకుండానే ఇకపై శాటిలైట్లను ప్రయోగించవచ్చు. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న స్పిన్‌లాంచ్ కంపెనీ ఈ మేరకు నూతన లాంచింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. కైనెటిక్ లాంచ్ సిస్టమ్ (సెంట్రిఫ్యూయల్ లాంచ్ టెక్నాలజీ)గా పిలుస్తున్న దీని సాయంతో 5 వేల ఎంపీహెచ్ వేగంతో శాటిలైట్లను లో ఎర్త్ ఆర్బిట్‌లోకి పంపించవచ్చు. ఈ స్పిన్‌లాంచ్ ఇంధనాన్ని స్పిన్నింగ్ సెంట్రిఫ్యూజ్గా మార్చుకొని ఉపగ్రహాలను అత్యంత వేగంగా ఆకాశంలోకి దూసుకెళ్లేలా చేస్తుంది.
స్పిన్‌లాంచ్ విద్యుత్తు శక్తి ఆధారంగా పని చేస్తుంది. తద్వారా ఇంధనం అవసరం ఉండదు. అంతేకాదు, ప్రయోగ సమయంలో ఇది 10,000 జీఎస్‌ను కూడా తట్టుకుంటుంది. సాధారణ రాకెట్లతో పోలిస్తే ఇది 100 రెట్లు ఎక్కువ. 200 కిలోల కంటే తక్కువ బరువున్న పేలోడ్లను ప్రయోగించేందుకు ఈ విధానం అనుకూలమని కంపెనీ వర్గాలు తెలిపాయి.
సాంప్రదాయ రాకెట్లు ఒక్కో ప్రయోగానికి 9 లక్షల పౌండ్ల ఇంధనం అవసరం. అయితే, స్పిన్‌లాంచ్ పూర్తిగా ఇంధన రహితం కానప్పటికీ, సాంప్రదాయ రాకెట్లతో పోలిస్తే సుమారు 90 శాతం ఇంధనం తక్కువ ఉపయోగిస్తుంది. ఉపగ్రహ లక్ష్యాలను చేరుకునేందుకు దీనికి చిన్నపాటి థ్రస్టర్లు అవసరమవుతాయి. ఆ సమయంలో మాత్రమే ఇంధన అవసరం ఉంటుంది. అతి తక్కువ ఇంధన వాడకం వల్ల ఓజోన్ పొర క్షీణతను నివారించే ఆస్కారం ఉంది. దీని గ్రావిటీ ఫోర్స్ మానవ సహిత ప్రయోగాలకు అనుకూలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భవిష్యత్తులో మానవ సహిత మిషన్ల కోసం ప్రయోగించే ఆస్కారం లేకపోలేదని అంటున్నారు. ఇప్పటికే 11 నెలల్లోనే 10 ప్రయోగాలను కంపెనీ విజయవంతంగా చేపట్టింది. 2026 నుంచి పూర్తిస్థాయి ప్రయోగాలు చేపట్టనున్నట్టు కంపెనీ సీఈవో జోనాథన్ యానీ వెల్లడించారు. కార్నెల్ యూనివర్సిటీ ఇంజినీర్లు స్పిన్లాంచ్కు అనుగుణంగా పేలోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. అతి తక్కువ వ్యయం, కార్బన్ ఉద్గారాలు తక్కువగా వెలువడటం లాంటివి దీనికి అనుకూలమని ఎంఐటీ, నాసా పరిశోధకులు పేర్కొన్నారు.