హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : కేబుల్ చానల్ జర్నలిస్ట్‌లకు అక్రెడిటేషన్లు ఇచ్చేదాకా పోరాడుతామని జర్నలిస్ట్ సంఘాల నేతలు స్పష్టంచేశారు. కొత్త జీవోలో కేబుల్ చానళ్లకు అక్రెడిటేషన్లను పూర్తిగా తొలగించడాన్ని నిరసిస్తూ కేబుల్ చానళ్ల జర్నలిస్ట్‌ల జేఏసీ, జర్నలిస్ట్ సంఘాల నేతలు మంగళవారం ఐఅండ్‌పీఆర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూ జే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతీసాగర్ మాట్లాతూ గత ప్రభుత్వ హయాంలో జీవో 239 ప్రకారం కేబుల్ చానళ్లకు అక్రెడిటేషన్లు ఇచ్చిన విధంగా హైదరాబాద్‌లో ఐఅండ్‌పీఆర్ ద్వారా 12, ప్రసారాలు జరిగే జిల్లాల్లో 4 అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాల్సిందే డిమాండ్ చేశారు.
టెలివిజన్ రంగంలో కేబుల్ చానళ్లది కీలకపాత్ర అని, వారికి అక్రెడిటేషన్లు తొలగించడం శోచనీయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 23 వేల అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తే ఇప్పుడు వాటి సంఖ్యను 10 వేలకు పరిమితం చేయడానికి కుట్ర జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెంజూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి యోగానంద్, కేబుల్ చానల్స్ జేఏసీ నేతలు సత్యనారాయణ, వెంకటేశ్, భరత్, చలపతి పాల్గొన్నారు.