Warangal Sports School | హనుమకొండ, మార్చి 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అత్యుత్తమ క్రీడా పాలసీ అని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, వాస్తవాలకు పొంతన కుదరడంలేదు. స్పోర్ట్స్ యూనివర్సిటీ, దానికి అనుబంధంగా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు ప్రక్రియ అంతా ఉత్తుత్తిగానే ఉంటున్నది.
రాష్ట్రంలో హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్‌లోని స్పోర్ట్స్ స్కూళ్లకు అదనంగా వరంగల్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. వరంగల్ నగర శివారులోని 25 ఎకరాల్లో రూ.150 కోట్లతో శాశ్వత భవనాలు, మైదానాలను నిర్మించి స్పోర్ట్స్ స్కూల్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ప్రచారం తప్పితే ఆచరణను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ నగరంలో ఉత్తుత్తి స్పోర్ట్స్ స్కూల్‌ను ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ నగరంలోని జవహార్లాల్నెహ్రూ స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ సూల్ కమ్ ఎక్స్‌లెన్స్‌ను గత నవంబరు 16న హడావుడిగా ప్రారంభించింది. స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరంలోనూ అడ్మిషన్లకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రచారం హడావుడి తప్పితే వరంగల్‌లోని స్పోర్ట్స్ స్కూల్లో ఎలాంటి కనీస వసతులు కల్పించలేదు. అడ్మిషన్లు పొందిన వారికి బోధించేందుకు సిబ్బంది లేరు. క్రీడలలో వారిని తీర్చిదిద్దేందుకు ట్రైనర్లు లేరు. టీచింగ్, ట్రైనింగ్ లేకుండా స్కూల్ ఉండడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వరంగల్‌లోని స్పోర్ట్స్ సూల్ నిర్వహణకు టీచింగ్, ట్రైనింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కలిపి 106 మంది ఉద్యోగులు అవసరమవుతారని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ(సాట్స్) ప్రతిపాదించింది. ఇందు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా పట్టించుకోవడం లేదని క్రీడాశాఖ అధికారులు వాపోతున్నారు. స్పోర్ట్స్ స్కూల్లో సిబ్బంది నియామకంపై ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇద్దరు మంత్రులకు, స్థానిక ఎంపీకి, నగర పరిధిలోని నలుగురు ఎమ్మెల్యేలను స్థానిక అధికారులు పదేపదే కలిసి అభ్యర్థించారు. స్పోర్ట్స్ స్కూల్ నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకం కోసం తగిన నిధులు, ఉత్తర్వులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల నియామకంపై ఆదేశాలు వచ్చేలా చూడాలని కోరారు. అయితే దీనిపై ఎలాంటి ప్రకటన లేకపోవడం తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఇదిలా ఉంటే స్పోర్ట్స్ స్కూల్‌కు అవసరమైన సిబ్బంది విషయంలోనూ ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని స్పష్టమవుతున్నది. సాధారణంగా స్పోర్ట్స్ స్కూల్లో అడ్మినిస్ట్రేషన్, ట్రైనింగ్, హెల్త్, హాస్టల్ విభాగాల్లో సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్‌లో 20 మంది, ట్రైనింగ్‌లో 35, టీచింగ్‌లో 22, హెల్త్‌లో 9 మంది, హాస్టల్ నిర్వహణకు 20 మంది సిబ్బంది అవసరముంటుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. దీనికి తోడు కండిషనింగ్ కోచ్, అథ్లెటిక్స్, రెజ్లింగ్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, రోయింగ్, ఫెన్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరీ, స్విమ్మింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్, హాకీ, జూడో, బోటో, హ్యాండ్‌బాల్, కబడ్డీ, ఫుట్‌బాల్ క్రీడల్లో కోచ్‌లు, గ్రౌండ్‌మెన్లు ఉంటేనే విద్యార్థులకు శిక్షణ సాఫీగా జరుగుతుంది. క్రీడలతోపాటు రెగ్యులర్ అకాడమిక్ క్లాసుల కోసం నాలుగో తరగతి నుంచి 10వ తరగతి వరకు సూల్… ఇంటర్మీడియట్ కాలేజీ ఉండాలి. ప్రిన్సిపాల్, ఏడుగురు సూల్ అసిస్టెంట్లు, నలుగురు ఎస్జీటీ తప్పనిసరి. క్రీడాకారులకు ఫిట్నెస్ అనేది కీలకం. స్పోర్ట్స్ స్కూల్లో జనరల్ ఫిజిషియన్, ఇద్దరు ఫిజియోథెరపిస్టులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, న్యూట్రిషనిస్ట్‌లు, ఇద్దరు మసాజర్లు కచ్చితంగా ఉండాలి. ఈ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో వరంగల్ నగరంలోని స్పోర్ట్స్ స్కూల్ నామమాత్రంగానే ఉంటుంది.