యాదగిరిగుట్ట, మే 22 : ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని.. కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. ఖబడ్దార్.. అయిలయ్య హెచ్చరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే గ్రామాల్లో ఎక్కడిక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బీర్ల అయిలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఆ పార్టీ మండలాధ్యక్షుడు, కురుమ సంఘం రాష్ట్ర నాయకుడు కర్రె వెంకటయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యాలయం నుంచి స్వామివారి వైకుంఠ ద్వారం వరకు అయిలయ్య దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. పాత గుట్ట చౌరస్తా వద్దకు రాగానే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా బీర్ల దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించారు. కేటీఆర్‌కు క్షమాపణ చెప్పాలని భీష్మించుకుని కూర్చున్నారు. సీఐ భాస్కర్, ఎస్ఐ ఉదయ్ చేరుకొని బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు.
అనంతరం కర్రె వెంకటయ్య మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిని ఐటీ హబ్‌గా మార్చి, ప్రపంచ అగ్రగామి సాఫ్ట్వేర్ కంపెనీలను హైదరాబాద్‌కు రప్పించి వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించిన ఘనత మాజీ మంత్రి కేటీఆర్‌ది అన్నారు. విదేశాల్లో ఉన్నత ఉద్యోగం, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమాలు చేసిన నాయకుడు కేటీఆర్ అని గుర్తు చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పని చేసిన నాయకుడి నాలుకపై యాసిడ్ పోస్తానని మాట్లాడుతావా బిడ్డా.. అంటూ మండి పడ్డారు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రావాలని సవాల్ విసిరారు. ఇచ్చిన హామీలు అమలు చేసే చేతగాని దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ అని, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటి వరకు ప్రజలకు చేసిన మేలేమీ లేదని విమర్శించారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి బీర్ల చేసింది శూన్యమని, గత ప్రభుత్వ పాలనలో యాదగిరిగుట్టకు మంజూరైన వైద్యకళాశాల ఏమైందని ప్రశ్నించారు. గుట్ట అభివృద్ధికి పెండింగ్‌లో ఉన్న 10 శాతం పనులకు రూపాయి కూడా కేటాయించని సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా మంత్రుల మోచేతి నీళ్లుతాగే నువ్వు.. ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ప్రజాప్రతినిధులు లేక గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయని, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే భయపడే మీకు.. బీఆర్ఎస్ పార్టీపై మాట్లాడే అర్హత లేదని మండిపడారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో స్వర్ణయుగాన్ని చూసిన రైతులు.. ఇప్పుడు రాక్షస రాజ్యాన్ని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీర్ల అయిలయ్య అవినీతిపై త్వరలో నియోజకవర్గంలో పాదయాత్ర చేసి ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, బీఆర్ఎస్ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, మాజీ ఉప సర్పంచ్ మారెడ్డి కొండల్‌రెడ్డి, నాయకులు మిట్ట వెంకటయ్య, గుండ్లపల్లి వెంకటేశ్‌గౌడ్, కసావు శ్రీనివాస్, ఆవుల సాయి, కవిడె మహేందర్, ముఖ్యర్ల సతీశ్, ఆరె శ్రీధర్, సయ్యద్ బాబా, కాంటేకార్ పవన్, ఆరే మల్లేశ్, మొగిలిపాక రమేశ్, శారాజీ రాజేశ్, ఒగ్గు మల్లేశ్, చిత్తర్ల బాలయ్య, శిఖ శ్రీనివాస్, అంకం నర్సింహ, ఆరె స్వామి, గడ్డం చంద్రం, గుణగంటి బాబారావు, పాండవుల భాస్కర్ పాల్గొన్నారు.